
యూపీ పోలీసుల పేరు చెబితే అక్కడి నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ తమకు ఎదురే లేదన్నట్టుగా ఇన్నాళ్లూ చెలరేగిపోయిన క్రిమినల్స్ ఆట కటిస్తున్నారు ఉత్తరప్రదేశ్ రక్షక భటులు. తామున్నది శాంతి భద్రతలు కాపాడటానికేనని, నేరాలు చేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని తేల్చి చెబుతున్నారు. తమదైన శైలిలో కిరాతకుల పీచమణుస్తున్నారు. ఇందుకు అధికారిక లెక్కలే ప్రత్యక్ష సాక్ష్యం.
ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సీఎంగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు సగటున రోజుకు దాదాపు ఐదు ఎన్‌కౌంటర్లు జరిగినట్టు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. యూపీ పోలీసుల డేటా ప్రకారం.. 2017, మార్చి 20 నుంచి ఈ ఏడాది ఆగస్టు 6 వరకు రాష్ట్రంలో 15,140 ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఫలితంగా 243 మంది క్రిమినల్స్ హతమయ్యారు. 9,668 మందికి గాయాలయ్యాయి. 31 వేల మందిపైగా నిందితులు అరెస్టయ్యారు. విధి నిర్వహణలో 18 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా, 1720 మంది గాయపడిన్నట్టు యూపీ పోలీసుల అధికారిక డేటా వెల్లడించింది.
నో కాంప్రమైజ్
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిక్షణలో రాజీపడబోమని, నేరాలు చేసే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని యూపీ డీజీపీ రాజీవ్ కృష్ణ (Rajeev Krishna) స్పష్టం చేశారు. తాము చేపట్టిన ప్రతి చర్య కూడా నిష్పక్షపాతంతో పారదర్శకంగా ఉంటుందన్నారు. మానవ హక్కులను గౌరవిస్తూనే చట్టానికి లోబడి వ్యవహరించామని ఆయన చెప్పారు. ఎదురు కాల్పుల సమయంలో జాతీయ మానవ హక్కుల మార్గదర్శకాలను యూపీ పోలీసులు పాటించారు. గ్యాంగ్‌స్టర్, మాఫియా డాన్‌లను ఉక్కుపాదంతో అణిచివేస్తాం. ఇదిలాగే కొనసాగుతుందని అన్నారు. నేరస్థులను పట్టుకునే క్రమంలో తమ పోలీసులు ఎంతో దైర్యసాహసాలు ప్రదర్శించారని, విధి నిర్వహణలో ప్రాణాలు త్యాగం చేశారని, కొంతమంది గాయపడ్డారని తెలిపారు.
వెస్ట్‌లోనే హయ్యస్ట్
యూపీ పోలీసుల అధికారిక లెక్కల ప్రకారం.. మొత్తం ఎన్‌కౌంటర్లలో సగానికి పైగా పశ్చిమ యూపీలోని పోలీసు కమిషనరేట్లు, జోన్స్ పరిధిలోనే చోటు చేసుకోవడం గమనార్హం. మీరట్ జోన్‌లో అత్యధిక ఎన్‌కౌంటర్లు (4,282) చోటుచేసుకున్నాయి. అగ్రా జోన్ (2,326), బరేలీ (2,004) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఒక్క మీరట్ జోన్‌లోనే 81 మంది ఎన్‌కౌంటర్లలో హతమయ్యాయి. 2,951 మంది గాయపడగా, 4,568 మంది అరెస్టయ్యారు. ఇదే సమయంలో లక్నో జోన్‌లో 806 ఎన్‌కౌంటర్లలో 17 మంది నేరస్థులను పోలీసులు మట్టుబెట్టి 1,781 మందిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా 166 మంది పోలీసులు గాయపడ్డారు. గౌతమ్ బుద్ధ నగర్ కమిషనరేట్ పరిధిలో 1,084, కాన్పూర్ జోన్‌లో 671 ఎన్‌కౌంటర్లు జరిగాయి.

పబ్లిక్ సేఫ్టీ ఫస్ట్
పోలీసు కమిషనరేట్ల వారీగా చూస్తే.. గౌతమ్ బుద్ధ నగర్ కమిషనరేట్ పరిధిలో అత్యధిక ఎన్‌కౌంటర్లు జరిగాయి. తర్వాతి స్థానిల్లో ఘజియాబాద్ (696), ఆగ్రా (430), వారణాసి(124), లక్నో (132) నిలిచాయి. నేరస్థులను పట్టుకోవడానికి వెళ్లినప్పుడు తమపైకి కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్లు జరిగినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ప్రజలకు రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతలను కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమని చెప్పారు.
చదవండి: కోట్లు కుమ్మరిస్తున్నారు... ఎక్కడా తగ్గట్లేదు!
క్రిమినల్స్ ఫినిష్
యూపీ ఎన్‌కౌంటర్లలో కరుడు గట్టిన పలువురు నేరస్థులు హతమయ్యారు. డీఎస్పీతో సహా 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న వికాస్ దూబేను ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు. 60 క్రిమినల్ కేసులున్న అతడి తలపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. మరో క్రిమినల్ షకీల్ అహ్మద్‌పై 25 కేసులుండగా, అతడి తలపై రూ. 2.5 లక్షల రివార్డు ఉంది. 10 క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న కమల్ బహదూర్‌పై కూడా రూ. 2.5 లక్షల రివార్డు ఉంది. లక్ష్మణ్ యాదవ్ రూ. 1.5 లక్షల రివార్డు ఉంది. వీరిని ఎన్‌కౌంటర్లలో పోలీసులు హతమార్చడంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.