
న్యూఢిల్లీ: అనుమానాస్పద మరణవాంగ్మూలం ఆధారంగా నేర నిర్ధారణ సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇతరత్రా గట్టి సాక్ష్యాధారాలు లేనప్పుడు కేవలం అలాంటి వాంగ్మూలాన్ని ఆధారంగా తీసుకోజాలమని స్పష్టం చేసింది. భార్యకు నిప్పంటించి హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిని నిరపరాధిగా తేలు స్తూ న్యాయమూర్తులు సుధాన్షు ధూలియా, ఎ.అమానతుల్లా ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. అతనికి దిగువ కోర్టు విధించిన జీవితఖైదును సమర్థిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
‘‘మరణ వాంగ్మూలం కీలక సాక్ష్యమన్నది నిస్సందేహం. దాని ఆధారణంగా నేర నిర్ధారణ చేయడమూ సబబే. కానీ ఆ వాంగ్మూలమే అనుమానాస్పదమైన సందర్భాల్లో దాని ఆధారంగా నిందితున్ని దోషిగా నిర్ధారించడం సరికాదు. ప్రస్తుత కేసులో భార్య పరస్పరం పూర్తి విరుద్ధమైన వాంగ్మూలాలిచ్చింది. పైగా వరకట్న వేధింపులు జరగలేదని దర్యాప్తులో స్పష్టంగా తేలింది. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతర సాక్ష్యాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే నిర్ణయానికి రావాలి’’ అని సూచించింది.