మరో ‘హనీమూన్‌ కేసు’.. ఐస్ క్రీం ఫ్రీజర్‌లో మృతదేహం.. | Tripura Body of Missing man Found in Ice Cream Freezer | Sakshi
Sakshi News home page

మరో ‘హనీమూన్‌ కేసు’.. ఐస్ క్రీం ఫ్రీజర్‌లో మృతదేహం..

Jun 12 2025 7:25 AM | Updated on Jun 13 2025 1:25 PM

గౌహతి: మేఘాలయలో చోటుచేసుకున్న హనీమూన్‌ హత్య కేసు మరువకముందే ఇదే ఈశాన్య రాష్ట్రానికి చెందిన త్రిపురలో ఇటువంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అగర్తలోని ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడి అదృశ్యం వెనుకనున్న రహస్యాన్ని పోలీసులు ఛేదించారు.

త్రిపుర రాజధాని అగర్తలకు 120 కి.మీ దూరంలో ఉన్న ధలై జిల్లాలోని గండచెర్రా మార్కెట్‌లో  ఐస్‌క్రీమ్ ఫ్రీజర్‌లో దాచిన ట్రాలీ బ్యాగ్‌లో ఒక యువకుని మృతదేహం లభ్యమయ్యింది. మేఘాలయలో చోటుచేసుకున్న ‘హనీమూన్ హత్య’ దరిమిలా ఇటువంటి ఘటనే చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.  అగర్తల స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్ట్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న సరిఫుల్ ఇస్లాం(20) అనే యువకుడు హత్యకు గురయ్యాడు.  ఈ యువకుడు,  దిబాకర్ సాహా(28) అనే వైద్యుడు మరో మహిళ మధ్య నడిచిన ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ ఈ హత్యకు దారితీసిందని ఒక పోలీసు అధికారి తెలిపారు.

ప్రాథమిక దర్యాప్తులో తొలుత ఆ మహిళకు,  ఆమె బంధువు అయిన దిబాకర్ సాహా మధ్య ప్రేమ వ్యవహారం ఉందని తేలింది. సరిఫుల్ ఇస్లాం హత్య కేసులో ఆ డాక్టర్‌, అతని తల్లిదండ్రులతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో మరో మహళ కూడా ఉంది. జూన్ 8న సాయంత్రం డాక్టర్‌ దిబాకర్ సాహా.. సరిఫుల్‌ను సౌత్ ఇంద్రానగర్ కబర్‌ఖలా ప్రాంతానికి రమ్మని పిలిచాడు. అక్కడి జోయ్‌దీప్ దాస్(20) ఇంటిలో బహుమతి ఇస్తానని చెప్పాడు. అతని మాట మేరకు సరిఫుల్  అక్కడకు రాగానే దిబాకర్, అతని స్నేహితులు అనిమేష్ యాదవ్(21) నబనితా దాస్(25) అతనిపై దాడి చేశారు. అతన్ని గొంతు నరికి హత్య చేశారు. తరువాత మృతదేహాన్ని  ఒక ట్రాలీ బ్యాగ్‌లో ప్యాక్ చేశారని పోలీసులు తెలిపారు.

మర్నాటి ఉదయం దిబాకర్‌తో పాటు అతని తల్లిదండ్రులు దీపక్, దేబికా సాహాలు గండచెర్రా నుండి అగర్తలాకు మృతదేహం ఉన్న ట్రాలీ బ్యాగ్‌ను తీసుకెళ్లారు. తరువాత శవాన్ని గండచెర్రా మార్కెట్‌లోని వారి దుకాణంలోగల ఐస్ క్రీం ఫ్రీజర్‌లో దాచారు. ఈ కేసును పోలీసులు రోజుల వ్యవధిలో ఛేదించారు. మంగళవారం రాత్రి ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు బుధవారం మధ్యాహ్నం సరిఫుల్ ఇస్లాం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారందరినీ గురువారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ముగ్గురి మధ్య నడిచిన ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని, వారి మొబైల్ మెసేజ్‌ల ఆధారంగా పోలీసులు గుర్తించారు. 

ఇది కూడా చదవండి: ‘హనీమూన్‌’ కేసు: ‘కొండ మీంచి తోసేస్తా’.. సోనమ్‌ ‘ప్లాన్‌ బీ’

Advertisement
 
Advertisement
Advertisement