చీఫ్ విప్‌గా గుర్తించాలంటూ
స్పీకర్‌కు మమత వర్గం వినతి
కార్యవర్గం జాబితాను సోమవారమే ఈసీకి పంపినట్లు వెల్లడి
కోల్‌కతా: టీఎంసీలో అంతర్గత సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. పార్టీ విప్‌గా ఉన్న ఫిర్హాద్ హకీమ్‌ను తొలగించి, మదన్ మిత్రాను విప్‌గా గుర్తించాలంటూ మాజీ సీఎం మమత మంగళవారం అసెంబ్లీ స్పీకర్‌ను కోరారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మమత నామినేట్ చేసిన శోభన్‌దేవ్ చటోపాధ్యాయ్ ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌కు వినతి పత్రం అందజేశారు. పార్టీ నాయకత్వంపై న్యాయపరమైన వివాదం కొనసాగుతున్నందున, చీఫ్ విప్ పోస్టుపై ఎటువంటి అభ్యంతరాలకు అవకాశం లేదని ఆయన స్పీకర్‌కు వివరించారు.
అదేవిధంగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్హాద్ సహా పలువురు సీనియర్ నేతలకు మంగళవారం టీఎంసీ షోకాజ్ నోటీసులు పంపింది. ఫిర్హాద్ హకీమ్ ఇటీవల కోల్‌కతా మేయర్ పదవికి రాజీనామా చేసి, రితబ్రత బెనర్జీ సారథ్యంలోని తిరుగుబాటు వర్గంలో చేరారు. సోమవారం రెబెల్ గ్రూపు సమాంతర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఫిర్హాద్‌కు వైస్ చైర్మన్‌గా బాధ్యతలను అప్పగించడం తెల్సిందే. అదేవిధంగా, తాము కూడా కొత్తగా మరో కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామని, ఆ వివరాలను ఎన్నికల కమిషన్‌కు సోమవారమే పంపించామని మమత వర్గం వెల్లడించింది. అందులో, టీఎంసీ చైర్‌పర్సన్‌గా మమతా బెనర్జీని పేర్కొన్నారు. రితబ్రత బెనర్జీ సారథ్యంలో రెబెల్ వర్గం మంగళవారం కోల్‌కతాలో చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో)ని కలిసి తమ కార్యవర్గం వివరాలను అందజేయడం గమనార్హం.
మమత ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టు విచారణ
భవానీపూర్ నియోజకవర్గం ఎన్నిక ఫలితాన్ని సవాల్ చేస్తూ టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ వేసిన ఎన్నికల పిటిషన్‌పై మంగళవారం కలకత్తా హైకోర్టు విచారణ చేపట్టింది. భవానీపూర్ నియోజకవర్గంలో ప్రస్తుతం సీఎం సువేందు అధికారి చేతిలో మమత ఓటమి పాలుకావడం తెల్సిందే. ప్రాథమికంగా వాదనలు విన్న జస్టిస్ గౌరంగ్ కాంత్ నియోజకవర్గం వ్యాప్తంగా మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టిన కేంద్రాల్లో సీసీటీవీ ఫుటేజీని, ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను భద్రపర్చాలని జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ఉంచాలని ఆదేశించారు.
అదేవిధంగా, ‘నా సోదరుడు బీజేపీ జాతీయ ప్రతినిధిగా ఉన్నారు. ఈ కేసు విచారణ చేపట్టడంపై మీకేమైనా అభ్యంతరం ఉందా?’అని టీఎంసీ తరఫున హాజరైన ఆ పార్టీ ఎంపీ, లాయర్ కల్యాణ్ బెనర్జీని ప్రశ్నించారు. తనకెలాంటి అభ్యంతరం లేదని, న్యాయ వ్యవస్థపై నమ్మకముందని బెనర్జీ బదులిచ్చారు. దీంతో, ఈ కేసు 12 వారాలకు వాయిదా వేశారు. నాలుగు వారాల్లోగా అఫిడవిట్ వేయాలని సంబంధిత పక్షాలను ఆదేశించారు.


