మమతా బెనర్జీకి కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం | Kalyan Banerjees ultimatum to Mamata amid TMC exodus | Sakshi
Sakshi News home page

మమతా బెనర్జీకి కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం

Jun 11 2026 5:32 PM | Updated on Jun 11 2026 6:56 PM

Kalyan Banerjees ultimatum to Mamata amid TMC exodus

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ గురువారం పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు. సంతకాల ఫోర్జరీ కేసులో తనను న్యాయవాదిగా చివరి క్షణంలో తొలగించారని, అది తనకు తీవ్ర అవమానంగా అనిపించిందని ఆరోపించారు.

ఇటీవల పలువురు టీఎంసీ నేతలు, ప్రజాప్రతినిధులు మమతా బెనర్జీకి గుడ్‌ బై చెప్పేసినప్పటికీ ఆమెకు విధేయుడిగా కొనసాగిన కల్యాణ్ బెనర్జీ ఇప్పుడు అంతర్గత విభేదాలను మరింత తీవ్రం చేస్తూ అల్టిమేటం జారీ చేశారు. “అభిషేక్‌ కావాలా? లేక నేను కావాలా?” అని ఆయన ప్రశ్నించారు. దీంతో పార్టీ నాయకత్వంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు మరోసారి బయటపడ్డాయి.

ప్రస్తుతం జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. కల్యాణ్‌ బెనర్జీ కూడా టీఎంసీని వీడే అవకాశం ఉంది. ఆయన బహిరంగంగానే మమతా బెనర్జీకి "నన్నా? అభిషేక్ బెనర్జీనా? ఎవరిని ఎంచుకుంటారో తేల్చండి" అని చెప్పడంతో పాటు, "పార్టీ అభిషేక్ లేకుండా నడవదని మమతా భావిస్తే నేను నా నిర్ణయం తీసుకుంటాను" అని హెచ్చరించారు.

అసలు ఆ ఫోర్జరీ కేసు ఏంటంటే.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సోవందేబ్ చటోపాధ్యాయ నియామకానికి సంబంధించి టీఎంసీ తీర్మానం పంపించారు. ఆ తీర్మానంపై కొంతమంది టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలు నకిలీవని ఇద్దరు ఎమ్మెల్యేలు ఆరోపించారు. వీరు తమ సంతకాలు అనుమతి లేకుండా తీర్మానంలో చేర్చారని అసెంబ్లీ సచివాలయానికి ఫిర్యాదు చేశారు.

కాగా, సంతకాల ఫోర్జరీ కేసు విచారణలో కలకత్తా హైకోర్టులో అభిషేక్ బెనర్జీ తరఫున వాదిస్తున్న న్యాయవాదిగా కల్యాణ్ బెనర్జీ స్థానంలో మరొకరిని నియమించడంతో ఈ వివాదం మొదలైంది.

ఆ కేసులో అభిషేక్ బెనర్జీకి హైకోర్టు తాత్కాలిక అరెస్టు రక్షణ ఇచ్చింది. అదే రోజు సాయంత్రం 6 గంటలలోపు పశ్చిమ బెంగాల్ సీఐడీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ప్రస్తుతం అభిషేక్ ఢిల్లీలో ఉన్నారు.

కేసు కోసం తాను రాత్రంతా శ్రమించి, అత్యవసర విచారణ కోసం న్యాయమూర్తి ఎదుట వాదించానని కల్యాణ్‌ బెనర్జీ చెప్పారు. అయితే మరో పిటిషన్ దాఖలైందని, ఇంకొక న్యాయవాది కేసు చూస్తారని తనకు తెలియజేశారని అన్నారు.

“ఇతరులను అగౌరవపరచే వారి అలవాటు మారలేదు. అతడు (అభిషేక్ బెనర్జీ) అందరూ తనకంటే తక్కువవారనే భావనలో ఉంటాడు. కామాక్ స్ట్రీట్‌లోని ఉద్యోగుల్లా అందరినీ చూస్తాడు. నేను 45 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాను” అని కల్యాణ్‌ బెనర్జీ చెప్పారు.

“అతడు ఎంతో అహంకారిగా మారిపోయాడు. ఎవరికీ గౌరవం ఇవ్వడం లేదు. అందుకే నేను తప్పుకున్నాను. ఈ ఉదయం దీదీకి కూడా చెప్పాను. నన్ను లేదా అభిషేక్ బెనర్జీలో ఎవరు కావాలో తేల్చుకోండి” అని కల్యాణ్ బెనర్జీ అన్నారు.

టీఎంసీని వీడిన మరో నేత
మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్న సమయంలో ఈ భిన్నాభిప్రాయ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా అభిషేక్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎంపీలు, ఎమ్మెల్యేలు టీఎంసీని వీడుతున్నారు. గురువారం ప్రకాశ్‌ బారిక్‌ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతకుముందు సుష్మితా దేవ్‌, సుకేందు శేఖర్‌ రాయ్‌ కూడా రాజీనామా చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సంక్షోభం మరింత ముదురుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత వారం 58 మంది ఎమ్మెల్యేలు మమతకు ఎదురు తిరిగారు. ప్రతిపక్ష నేత పదవికి రితబ్రత బెనర్జీకి మద్దతు ప్రకటించారు. ఈ తిరుగుబాటును మమతా బెనర్జీ, ఆమె పార్టీ ఇటీవలి సంవత్సరాల్లో ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన అంతర్గత సవాళ్లలో ఒకటి. 

Advertisement
 
Advertisement
Advertisement