
జైసల్మేర్: రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగి ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
మంగళవారం (అక్టోబర్14)జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న ప్రైవేట్ బస్సులో మంటలు వ్యాపించారు. ఈ దుర్ఘటనలో 10 నుంచి 12 మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. మిగిలిన ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. బస్సు ప్రమాద సమయంలో మొత్తం 57మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
ప్రైవేట్ ట్రావెల్ బస్సు జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వెళ్తుండగా మార్గం మధ్యలో బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో వేగంగా వ్యాపించిన మంటలు బస్సు మొత్తాన్ని అంటుకున్నాయి. ఈ ఘటనలో భయాందోళనకు గురైన ప్రయాణికులు తమ ప్రాణాల్ని కాపాడుకునేందుకు హాహాకారాలు చేస్తూ బస్సు నుంచి బయటకు దూకారు. ఆ సమయంలో బస్సులో ఉన్న పలురువురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మిగిలిన ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. బస్సు నిర్వహణలో లోపం ఉందా? మంటలు ఎలా చెలరేగాయి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఈ పెను ప్రమాదం ప్రైవేట్ బస్సుల భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు నిరంతర తనిఖీలు, తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.