న్యూఢిల్లీ: సోమవారం సాయంత్రం దేశ రాజధానిని కుదిపేసిన పేలుడులో మరణించిన వారిలో ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాకు చెందిన 22 ఏళ్ల నౌమాన్ కూడా ఉన్నాడు. షామ్లీలోని జింఝానకు చెందిన నౌమాన్ తాను నిర్వహిస్తున్న సౌందర్య సాధనాల వ్యాపారం కోసం సంబంధిత వస్తువులు కొనుగోలు చేసేందుకు ఢిల్లీకి వచ్చాడు. ఇంతలో అతనిని మృత్యువు కబళించింది.
నౌమాన్ కుటుంబ సభ్యులకు ఈ వార్త తెలియగానే వారంతా కుంగిపోయారు. మంగళవారం ఉదయం వారు లోక్ నాయక్ ఆస్పత్రికి చేరుకున్నారు. సంఘటన జరిగిన సమయంలో నౌమాన్‌తో పాటు ఉన్న అతని బంధువు 21 ఏళ్ల అమన్ కూడా పేలుడులో గాయపడ్డాడు. సోమవారం సాయంత్రం గౌరీ శంకర్ ఆలయం నుండి బైక్‌పై తిరిగి వస్తున్న 28 ఏళ్ల అంకుష్ శర్మ , 20 ఏళ్ల రాహుల్ కౌశిక్ సాయంత్రం 6:52 గంటలకు జరిగిన పేలుడులో తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు అంకుష్ ముఖం, శరీరం 80 శాతం మేరకు తీవ్రంగా కాలిపోయింది.
ఈ పేలుడులో రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. అంతటి బాధలోనూ అతను అంకుష్‌ను ఆసుపత్రికి తరలించడంలో సాయపడ్డాడు. ఆస్పత్రి వెలుపల బాధితుల కుటుంబాలు గుమిగూడి, తమవారి కోసం వెదుకుతున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలోని దృశ్యాలు చూపరులకు కంటతడి పెట్టిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 6:52 గంటలకు జరిగిన ఈ పేలుడులో తొమ్మిది మంది మరణించగా, 20 మంది గాయపడ్డారు. హర్యానా రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన హ్యుందాయ్ కారు ఎర్రకోట సమీపంలోని ట్రాఫిక్ స్టాప్ వద్ద పేలిపోయింది. దీంతో సమీపంలోని పలు వాహనాలు తునాతునకలయ్యాయి. ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Delhi 10/11 Blast: అనుమానితుడి మొదటి ఫొటో..


