
పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రంలో ఆ పార్టీ ఉండదు
ఇంట్లో పోరు తట్టుకోలేక కేటీఆర్ సతమతమవుతున్నారు
పార్టీ పగ్గాల కోసం కవిత, కేటీఆర్ మధ్య తీవ్ర పోటీ ఉంది
హరీశ్‌రావు అదను కోసం ఎదురు చూస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: కేసీఆర్ కుటుంబంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే.. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఉండదని, అది మూడు, నాలుగు ముక్కలవుతుందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఇంట్లో పోరు తట్టుకోలేక కేటీఆర్ సతమతమవుతున్నారని, పార్టీ పగ్గాల కోసం కవిత, కేటీఆర్ మధ్య తీవ్ర పోటీ నెలకొందని చెప్పారు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావు అదను కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మహేశ్‌గౌడ్ శనివారం తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌లో విలేకరులతో మాట్లాడారు.
కేటీఆర్ ముందు ఇంట్లో కుంపటిని సరిచేసుకోవాలి
‘ఇంట్లో కుంపటి తట్టుకోలేక.. సోదరి తనకే ఏకు మేకై, మరో పవర్ సెంటర్ కావడంతో మతి భ్రమించి కేటీఆర్ ఆ ఎపిసోడ్‌ని డైవర్ట్ చేయడం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై పసలేని ఆరోపణలు చేస్తున్నారు. తన ఇంట్లో రగులుతున్న కుంపటిని కేటీఆర్ ముందుగా సరిచేసుకోవాలి. కవిత.. కేసీఆర్‌కే లేఖ రాసి పది సంవత్సరాల తప్పిదాలను ఎత్తి చూపే స్థాయికి వచ్చిందంటే, కేసీఆర్ కుటుంబంలో రగులుతున్న మంట ఎంత పెద్దదో అర్థమవుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మెజారిటీ ప్రజలు నమ్మిన నేపథ్యంలో వారి ఆకాంక్షల మేరకు విచారణ కమిషన్ వేశాం. కేసీఆర్, హరీశ్‌రావులకు నోటీసులు ఇస్తే కేటీఆర్ బెంబేలెత్తారు. అవినీతి బాగోతం బయటపడుతుందన్న భయంతో ఆయన మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.
బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం..
ఫార్ములా ఈ–కార్ రేసులో అవినీతి బట్టబయలైంది. అందులో కేటీఆర్ దొరికిపోయారు. హైదరాబాద్, దాని చుట్టపక్కల కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను తక్కువ ధరకే తన సన్నిహితులు, బంధువులకు అప్పజెప్పిన వైనం ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. కవిత లేఖలో ఆమె ప్రస్తావించిన అంశాలను పరిశీలిస్తే.. బీజేపీకి, బీఆర్‌ఎస్‌కు పరిపూర్ణమైన లోపాయికారి ఒప్పందం ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
బీఆర్‌ఎస్ గతంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందించిన కారణంగానే కవిత లిక్కర్ కేసులో ఇరికినప్పుడు అమిత్‌షా దగ్గరకు వెళ్లి బేరం కుదుర్చుకుని బెయిల్ వచ్చే విధంగా చేసుకున్న విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య లోపాయికారి మైత్రి ఉంది కాబట్టే బెయిల్ సునాయాసమైంది. కేటీఆర్, హరీశ్‌రావులే కదా.. ఆ బేరసారాలు చేశారు. తమ అవినీతి బయటపడకుండా ఉండేందుకు మోదీ, అమిత్‌షా కాళ్లు ఎవరు పట్టుకున్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు.
కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌లో బందీ చేశారు..
హరీశ్‌రావు, కేటీఆర్ కలసి కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌లో బందీ చేశారని నేను దాదాపు మూడున్నర నాలుగు మాసాల క్రితం చెప్పాను. అదిప్పుడు వాస్తవం అని తెలుస్తోంది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత చెప్పారు. ఆ దెయ్యాలు ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ మొదలుకొని.. కేటీఆర్, హరీశ్‌రావు, కవిత సహా ఆ కుటుంబం అంతా విచ్చల విడిగా అవినీతికి పాల్పడిన విషయాన్ని పదేళ్లుగా చూశాం.
వారి మధ్య వైరం వచ్చిందంటే రాజకీయ పదవుల పోటీ ఒకటైతే.. పంపకాల్లో కూడా తేడా వచ్చిం దనేది నా అనుమానం. అందుకే కవిత ఇవాళ బాహాటంగా తిరుగుబాటు జెండా ఎగురవేసినట్లు కనిపిస్తోంది. కేసీఆర్‌కు పట్టిన దెయ్యం కూడా కేటీఆరేనని కవిత చెప్పకనే చెప్పారు. దీంతో ఇంట్లో జరుగుతున్న పోరు ప్రజలకు తెలియకుండా ఉండేందుకు కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది’అని మహేశ్‌గౌడ్ అన్నారు.
ఘనంగా మహేశ్‌గౌడ్ జన్మదిన వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: టీపీసీచీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌లో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అధికార ప్రతినిధి సుధాకర్‌గౌడ్ తదితరులు మహేశ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి మిఠాయిలు తినిపించారు. అలాగే మహేశ్‌గౌడ్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాయి.
హైదరాబాద్ గాంధీభవన్‌లో తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, కల్లుగీత పారిశ్రామిక సంఘం చైర్మన్ నాగరాజు గౌడ్, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.