సాక్షి, చెన్నై: టీవీకే నేత విజయ్ తన కేడర్‌కు 11 రకాల ఆంక్షలను విధించారు. కరూర్ విషాద ఘటన నేపథ్యంలో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలలో నిమగ్నమయ్యారు. బుధవారం పుదుచ్చేరిలో జరగనున్న పర్యటనను దృష్టిలో ఉంచుకుని ముందుగా కేడర్‌కు 11 రకాల ఆంక్షలను వినయ పూర్వకంగా విజయ్ సోమవారం ప్రకటించారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు పుదుచ్చేరి ఉప్పలంలో సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు విస్తృతం చేశారు. ఈసభకు హాజరయ్యే వారికి క్యూఆర్ కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ నేతృత్వంలో అందజేస్తూ వస్తున్నారు.
పార్టీ ఆవిర్భావంతో పుదుచ్చేరిలో జరగనున్న తొలి సభను పోలీసులకు అనేక ఆంక్షలు,సూచనలు, షరుతుల నడుమ విజయవంతం చేసుకునేందుకు టీవీకే వర్గాలు పరుగులు తీస్తున్నాయి. అదే సమయంలో ఈ సభ విజయవంతానికి సహకరించాలని కోరుతూ కేడర్‌కు విజయ్ లేఖరాశారు. దయ చేసి ఈ సభకు తమిళనాడు నుంచి ఎవ్వరూ రావద్దని విన్నవించారు. తన వాహనాన్ని ద్విచక్ర వాహనాలు, కార్లలో వెంబడించ వద్దని వేడుకున్నారు. గర్భిణులు, చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు, దివ్యాంగులు, బాల బాలికలు దయ చేసిన రావొద్దని విన్నవించారు.
శాంతిభద్రతల పరిరక్షణకు..
పోలీసుల సూచనలను తప్పని సరిగా అనుసరించాలని, ట్రాఫిక్ జాం పరిస్థితులు కలి్పంచ వద్దు అని, శాంతి భద్రతల పరిరక్షణలో గానీయండి, క్రమశిక్షణలో గానీయండి హుందాగా వ్యవహరించాలని విన్నవించారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించాలని, సభా ప్రాంగణ పరిసరాలలో చెట్లు ఎక్కడం, గోడలపైకి ఎక్కడం, విద్యుత్ స్తంభాలపై నిలబడటం వంటి చర్యలకు ఎవ్వరూ పాల్పడ కూడదని కోరారు.
అంబులెన్స్‌లకు, మహిళలకు, పిల్లలకు ఇబ్బందులు ఎదురు కాకుండా ఆ పరిసరాలలో వ్యవహరించాలని, బహిరంగ సభ ముగిసిన అనంతరం శాంతియుతంగా ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది, సమస్య అన్నది సృష్టించకుండా వారి వారి ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. కాగా, సోమవారం ఏర్పాట్లను పరిశీలించిన భుస్సీ ఆనంద్ చేసిన వ్యాఖ్య హాట్‌టాపిగా పుదుచ్చేరిలో మారింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పొత్తు విషయంగా విజయ్ సమాచారం ఇస్తారని పేర్కొనడంతో అక్కడి రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. ఇక పార్టీ వర్కింగ్ కమిటీ సమన్వయ కర్త సెంగొట్టయ్యన్ పేర్కొంటూ, టీవీకే ఎన్నికల చిహ్నం చూసి దేశమే ఆశ్యర్య పోబోతందని స్పందించడంతో ఎలాంటి గుర్తు దక్కబోతుందో అనే ఉత్కంఠ నెలకొంది.


