ఎస్పీ చొరవతో గ్రామాలకు వలస కార్మికులు | Three migrant workers In Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఎస్పీ చొరవతో గ్రామాలకు వలస కార్మికులు

May 7 2025 11:23 AM | Updated on May 7 2025 1:37 PM

Three migrant workers In Tamil Nadu

రాయగడ: జిల్లాకు చెందిన ముగ్గురు వలస కార్మికులు ఎస్పీ స్వాతి ఎస్‌.కుమార్‌ చొరవతో స్వగ్రామాలకు చేరుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నియమగిరి పర్వత ప్రాంతాల్లోని డండమతి, కన్‌సూర్, పతలంబ గ్రామాలకు చెందిన అజిత్‌ సికక, లక్ష్మీ కడ్రక, బినతి సికక అనే ముగ్గురు యవతీ, యువకులు కుటుంబ పోషణ కోసం తమిళనాడులోని కోయంబత్తూరుకు పదిహేను రోజుల క్రితం వెళ్లారు. అక్కడ ఒక వ్రస్తాల దుకాణంలో పనికి చేరారు. 

అయితే కొద్ది రోజుల తర్వాత వారికి అక్కడ పనులు నచ్చకపోవడంతో పాటు రోజువారీ కూలి డబ్బులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో తాము ఇక ఈ కంపెనీలో పనిచేసేది లేదని, తమకు రావాల్సిన కూలి డబ్బులు ఇస్తే స్వగ్రామానికి తిరిగి వెళ్లిపోతామని యజమానికి చెప్పారు. అయితే అందుకు ససేమిరా యజమాని అంగీకరించకపోవడంతో పాటు వారు పనులు చేయాల్సిందేనని చెప్పేవాడు. రోజురోజుకూ పడుతున్న నరకయాతనను భరించలేని అజిత్‌ సికక రాయగడలోని ప్రముఖ జర్నలిస్టు బాదల్‌ కుమార్‌ థాకు ఫోన్‌చేసి తమ ఇబ్బందులను తెలియజేశాడు. 

దీంతో స్పందించిన బాదల్‌ థా జిల్లా ఎస్పీ, కలెక్టర్, జిల్లా కార్మిక శాఖ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఎస్పీ స్వాతి ఎస్‌.కుమార్‌ కొయంబత్తూరులోని కార్మిక శాఖ అధికారులతో చర్చించిన అనంతరం అక్కడ ఉన్నటువంటి ముగ్గురు వలస కార్మికులు సోమవారం తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారంతా జిల్లా యంత్రాంగానికి, ప్రత్యేకంగా ఎస్పీ స్వాతి ఎస్‌.కుమార్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement