
సాక్షి, చెన్నై : తనను ప్రేమించి పెళ్లికి సిద్ధపడ్డ ప్రియురాలు మరొకరితో మాట్లాతోందనే విషయాన్ని జీర్ణించుకోలేక ఓ ప్రియుడు ఉన్మాది మారాడు. ప్రియురాల్ని కత్తితో పొడిచి చంపేశాడు. నాగపట్నంకు చెందిన దినేష్ (27), సౌందర్య(25) శ్రీపెరంబదూరు సమీపంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు.
ఈ ఇద్దరు మేవలూరు కుప్పంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉన్నారు. తామిద్దరం ప్రేమించుకుంటున్నట్టు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆ ఇంటి యజమానికి తెలియజేసి అద్దెకు ఇళ్లు తీసుకున్నారు. పెళ్లి కాకుండానే ఈ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్న సమాచారం నాగపట్నంలోని తల్లిదండ్రులకు చేరింది. దీంతో ఇద్దరికి పెళ్లి చేయడానికి నిర్ణయించారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో తనతో పనిచేస్తున్న ఓ యువకుడితో సౌందర్య మరింత చనువుగా ఉండటం దినేష్ దృష్టికి చేరింది. ఈ విషయంగా ఆమెను మందలించాడు. అయినా, సౌందర్య అతడితో సన్నిహితంగా ఉండటం మొదలెట్టడంతో గొడవలు జరుగుతూ వచ్చాయి.
శనివారం రాత్రి ఆ యువకుడితో సౌందర్య ఉండటాన్ని చూసిన దినేష్ ఉన్మాదిగా మారాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం కోపంతో ఇంటికి వెళ్లి పోయాడు. ఆ తర్వాత అతడు కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో సౌందర్య స్నేహితులు ఆదివారం ఉదయాన్నే ఆమె ఇంటి వద్దకు వచ్చి చూడగా రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు.
శనివారం రాత్రి దినేష్ ,సౌందర్య మధ్య ఇంట్లో గొడవ జరిగడంతో కోపోద్రిక్తుడై ఆమెను కత్తితో పొడిచి చంపేసినట్టు తేలింది. పరారీలో ఉన్న దినేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సౌందర్య మృత దేహాన్ని పోస్టుమారా్టనికి తరలించారు.