
పాక్ సైన్యానికి నమ్మినబంటును: రాణా
ముంబై దాడుల్లో ఐఎస్‌ఐ హస్తముంది
హెడ్లీతో కలిసి లష్కరే శిక్షణ పొందా
దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడి
ముంబై: పదహారేళ్ల క్రితం ముంబైలో పాక్ ప్రేరేపిత లష్కరే తొయిబా ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం వెనక తన పాత్ర ఉందని ఆ దేశానికి చెందిన ఉగ్రవాది తహవ్వుర్ హుస్సేన్ రాణా అంగీకరించాడు. ఆ క్రమంలో పలు సంచలన విషయాలు వెల్లడించాడు. ‘‘ముంబై దాడుల వెనక పాక్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ హస్తముంది. నేను ముంబైలోనే ఉండి దాడులను పర్యవేక్షించా. పథకం ప్రకారమే ఆనాడు ముంబైలో ఉన్నా.
భారత్‌లో ఉంటూ పాక్‌కు, ఆ దేశ సైన్యానికి నమ్మకమైన ఏజెంట్‌గా పనిచేశా’’అని విచారణలో వెల్లడించాడు. కెనడా పౌరసత్వం, పాక్ మూలాలున్న రాణాను అమెరికా అరెస్టు చేసి విచారణ నిమిత్తం భారత్‌కు అప్పగించడం తెలిసిందే. తిహార్ జైలులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీలో ఉన్న రాణాను తాజాగా ముంబై క్రైం బ్రాంచ్ దర్యాప్తు నిపుణులు ప్రశి్నస్తున్నారు. ఈ క్రమంలో అతను పలు సంచలన విషయాలను వెల్లడించినట్టు జాతీయ మీడియా పేర్కొంది.
పక్కాగా లక్ష్యాల ఎంపిక
తన చిన్ననాటి స్నేహితుడు, ముంబై ఉగ్ర దాడి సూత్రధారుల్లో ఒకడైన డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో కలిసి పాక్‌లో లష్కరే ఉగ్ర శిక్షణ శిబిరాలకు పలుమార్లు హాజరైనట్టు రాణా వెల్లడించాడు. ‘‘మేమిద్దరం అక్కడ శిక్షణ తీసుకున్నాం. ముంబైలో పాగా వేసేందుకు అక్కడ ఇమిగ్రేషన్ కార్యాలయం పెట్టే ఆలోచన నాదే. దాని ముసుగులో పలు ఆర్థిక లావాదేవీలు జరిపా.
2008 నవంబర్ 26న మొదలైన ముంబై దాడుల వేళ నగరంలోనే ఉండి, మా ప్లాన్ సక్రమంగా అమలవుతోందో లేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షించా. ఎక్కడెక్కడ దాడులు చేయాలి, అందుకు ఏ ప్రాంతాలు అనువైనవి, ఎక్కడైతే ప్రాణనష్టం భారీగా ఉంటుందని అన్నీ బేరీజు వేసుకున్నా. ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వేస్టేషన్ తదితరాలను దాడులకు ఎంపిక చేసుకున్నాం. అందుకు ఐఎస్‌ఐ సాయపడింది. పాక్ సైన్యానికి నమ్మినబంటును గనకే ఖలీజ్ యుద్ధం వేళ నన్ను సౌదీ అరేబియాకు పంపారు’’అని చెప్పాడు.
హెడ్లీతో సహవాసం
‘‘హెడ్లీ, నేను 1974–79 మధ్య హసన్ అబ్దల్ క్యాడెట్ కాలేజీలో కలిసి చదువుకున్నాం. హెడ్లీ తండ్రి పాకిస్తానీ, తల్లి అమెరికన్. సవతి తల్లి పోరు పడలేక తను అమెరికా పారిపోయి కన్నతల్లితో ఉండేవాడు. 2003–04 మధ్య హెడ్లీ, నేను లష్కరే ఉగ్రశిక్షణ తీసుకున్నాం. ఉగ్ర దాడుల కంటే నిఘా కార్యకలాపాల్లో లష్కరేది క్రియాశీల పాత్ర అని హెడ్లీ చెప్పాడు. ముంబైలో నేను తెరిచిన ఇమిగ్రేషన్ ఆఫీసు మా ఉగ్ర నిఘా కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది.
దాన్ని ఓ మహిళ నడిపేది. 2008లో దాడులకు వారం ముందు భారత్ వచ్చా. నవంబర్ 20, 21 తేదీల్లో ముంబైలోని పోవాయ్ ప్రాంతంలో హోటల్లో దిగా. దాడులకు ముందే ముంబై వీడా. దుబాయ్ మీదుగా బీజింగ్ చేరుకున్నా. పాకిస్తాన్ అధికారులు సాజిద్ మిర్, అబ్దుల్ రహా్మన్ పాషా, మేజర్ ఇక్బాల్ నాకు తెలుసు’’అని రాణా చెప్పాడు. హెడ్లీ తప్పుడు డాక్యుమెంట్ల సాయంతో భారత్ రావడానికి రాణా సాయపడ్డట్టు దర్యాప్తులో తేలింది.