భారత్‌–రష్యా న్యాయ సహకారం  | Supreme Courts Of India And Russia Sign MoU On Judicial Cooperation | Sakshi
Sakshi News home page

భారత్‌–రష్యా న్యాయ సహకారం 

Jun 25 2026 5:46 AM | Updated on Jun 25 2026 5:46 AM

Supreme Courts Of India And Russia Sign MoU On Judicial Cooperation

అవగాహనా ఒప్పందంపై ఇరుపక్షాల సంతకాలు  

న్యూఢిల్లీ: న్యాయ రంగంలో ఇకపై పరస్పరం సహకరించుకోవాలని భారత్, రష్యా నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు భారత సుప్రీంకోర్టు, రష్యన్‌ ఫెడరేసన్‌ అత్యున్నత న్యాయస్థానం మధ్య అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది. దీనిపై మంగళవారం రష్యా రాజధాని మాస్కోలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, రష్యన్‌ ఫెడరేషన్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇగోర్‌ క్రాస్నోవ్‌ సంతకాలు చేశారు. 

రష్యన్‌ ఫెడరేషన్‌ సుప్రీంకోర్టు ప్రాంగణంలోజరిగిన ఈ కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. భారత్, రష్యా మధ్య ఉన్న చారిత్రక, సమకాలీన స్నేహపూర్వక సంబంధాలపై ఇరుదేశాల ప్రతినిధులు చర్చించారు. ఆధునిక యుగంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడానికి పరస్పర సహకారం ఆవశ్యకత, ఇరుదేశాల న్యాయవ్యవస్థలు చేపట్టిన డిజిటల్‌ సంస్కరణలపై అభిప్రాయాలు పంచుకున్నారు. 

కోర్టు కార్యకలాపాల్లో సాంకేతికత, కృత్రిమ మేధస్సు(ఏఐ)ను ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉన్నతమైన, నాణ్యత గల న్యాయ విద్య ప్రాముఖ్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. సార్వ¿ౌమ సమానత్వ సూత్రాలు, ఇరు దేశాలు భాగస్వాములుగా ఉన్న అంతర్జాతీయ ఒప్పందాల ఆధారంగా.. రెండు దేశాల న్యాయవ్యవస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి చేపట్టాల్సిన ఆచరణాత్మక చర్యలపై సంప్రదింపులు జరిగాయి. 

ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులు, వారి ప్రతినిధి బృందాల మధ్య విస్తృతమైన చర్చల అనంతరం అవగాహనా ఒప్పందం కుదిరింది. భారత్, రష్యా న్యాయవ్యవస్థల మధ్య నిరంతర సాంకేతిక సహకారం, లోతైన సంస్థాగత అనుసంధానం కోసం వ్యూహాలు, విధానాలను రూపొందించేందుకు ఒక ఉమ్మడి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement