
అలహాబాద్ హైకోర్టు జడ్జిపై సుప్రీం కోర్టు విధించిన ఆంక్షలు న్యాయ వివాదానికి దారి తీశాయి. ఈ నేపథ్యంలో దేశసర్వోన్నత న్యాయస్థానం వెనక్కి తగ్గింది. సదరు జడ్జి క్రిమినల్ కేసు విచారించకుండా గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంది.
న్యూఢిల్లీ: అలహాబాద్(యూపీ) హైకోర్టు జడ్జిపై ఆంక్షల విషయంలో సుప్రీం కోర్టు వెనక్కి తగ్గింది. సదరు జడ్జి క్రిమినల్ కేసులు విచారించకుండా గతంలో ఉత్తర్వులు వెలువరించిన సుప్రీం కోర్టు.. శుక్రవారం ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. ఈ ఆంక్షలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడం, అదే సమయంలో చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ విజ్ఞప్తి మేరకు ఈ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ పార్దీవాలా తెలిపారు. అదే సమయంలో ఈ కేసును రీలిస్టింగ్‌కు రిజిస్ట్రీని ఆదేశించారాయన.
మేము ఆ న్యాయమూర్తిని అవమానించాలనుకోలేదు. అలాంటి ఉద్దేశాలు మాకు లేవు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే మాస్టర్ ఆఫ్ రోస్టర్. కేసుల కేటాయింపు ఆయన అధీనంలో ఉంటుంది అని జస్టిస్ పార్దీవాలా స్పష్టం చేశారు. ‘‘న్యాయవ్యవస్థలో అంతర్భాగమైనప్పటికీ సుప్రీం కోర్టు సాధారణంగా హైకోర్టుల పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. అయితే, ఒక సందర్భం ఒక పరిమితిని దాటి.. సంస్థ గౌరవం ప్రమాదంలో పడినప్పుడు దానిని కాపాడేందుకు అవసరమైన చర్యగా ఈ కోర్టు తన రాజ్యాంగ బాధ్యతను(ఆర్టికల్ 136 ప్రకారం) నిర్వర్తించాల్సి వస్తుంది’’ అని అన్నారాయన.
ఒక సివిల్ పరిష్కారానికి ఆస్కారం ఉన్న వివాదంలో క్రిమినల్ చర్యలకు అనుమతినిస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఆదేశాలు జారీ చేయడం ఈ వివాదానికి కారణమైంది. ‘‘కేవలం సివిల్ పరిష్కారం జరిగిందని చెప్పి, నేరాన్ని మాఫీ చేయడం రాజ్యాంగబద్ధంగా కాదు. న్యాయవ్యవస్థకు ఇది ప్రమాదకరం. ’’ అని వ్యాఖ్యానించారాయన. ఈ ఆదేశాలపై జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. జస్టిస్ ప్రశాంత్ కుమార్‌కు రిటైరయ్యేంత వరకూ ఎలాంటి క్రిమినల్ కేసులు అప్పగించవద్దని ఈ నెల 4న ఆదేశించింది.
అయితే.. ఈ వ్యవహారం న్యాయ వివాదానికి తెరతీసింది. సుప్రీంకోర్టు ఆదేశంలోని కొన్ని అంశాలు అమలు కాకుండా నిరోధించేందుకు ఫుల్ కోర్టును సమావేశపరచాలంటూ అలహాబాద్ హైకోర్టుకు చెందిన 13 మంది న్యాయమూర్తులు కోరారు. ఈ మేరకు జడ్జీలు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ కూడా రాశారు కూడా.
అలహాబాద్ హైకోర్టుకు చెందిన జస్టిస్ ఆరిందం సిన్హా.. హైకోర్టు నియమానుసారం ఈ లేఖ రాయగా దానిపై మరో 12 మంది న్యాయమూర్తులు సంతకాలు చేశారు. హైకోర్టులపై పాలనాపరమైన పర్యవేక్షణ అధికారం సుప్రీంకోర్టుకు లేదని, అందుకే ఆగస్టు 4నాటి సుప్రీం ఆదేశాల్లో 24వ, 26వ పేరాల్లోని నిర్దేశాలను అమలు చేయరాదని ఫుల్‌కోర్టు తీర్మానించాలని జడ్జీలు కోరారు. సుప్రీం ధర్మాసనం మాటల్లోని తీవ్రతను ఫుల్ కోర్టు తీర్మానం తప్పు పట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయా పేరాల్లోని ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఇవాళ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.