సీబీఐకి ‘గట్టు’ దంపతుల హత్యకేసు | Supreme Court orders CBI to reinvestigate Gattu Vamanarao Nagamani case | Sakshi
Sakshi News home page

సీబీఐకి ‘గట్టు’ దంపతుల హత్యకేసు

Aug 13 2025 5:40 AM | Updated on Aug 13 2025 5:40 AM

Supreme Court orders CBI to reinvestigate Gattu Vamanarao Nagamani case

మళ్లీ దర్యాప్తు చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశం 

పిటిషనర్‌ గట్టు కిషన్‌రావుకు భద్రత కల్పించాలని సూచన 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచి్చంది. ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వామనరావు తండ్రి గట్టు కిషన్‌రావుకు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

తన కుమారుడు, కోడలి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్‌రావు 2021 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్‌ ఎంఎం సుందరేశ్, జస్టిస్‌ ఎన్‌.కె. సింగ్లా ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించింది. కిషన్‌రావు తరఫున సీనియర్‌ న్యాయవాదులు మేనక గురుస్వామి, చంద్రకాంత్‌లు వాదనలు వినిపించారు.  

నడిరోడ్డుపై హత్య: పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న వామనరావు, నాగమణి దంపతులను 2021 ఫిబ్రవరి 17న దుండగులు అడ్డగించి నడిరోడ్డుపైనే కత్తులతో నరికి చంపారు. మొదట ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేశారు. దానిని సీబీఐకి అప్పగించాలని కిషన్‌రావు అదే ఏడాది సెపె్టంబర్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. విచారణలో భాగంగా హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గతంలో కోర్టు ఆదేశించింది. 

చనిపోయే ముందు వామనరావు ఇచ్చిన మరణ వాంగ్మూలం వీడియోపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఎఫ్‌ఎస్‌ఎల్‌కి పంపించగా, అది అసలుదేనని ల్యాబ్‌ నివేదిక తేల్చింది. ఈ నివేదికతోపాటు అన్ని రికార్డులు పరిశీలించిన సుప్రీంకోర్టు.. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియచేసింది.

వామన్‌రావు కేసులో దోషులను శిక్షించాలి: మంత్రి శ్రీధర్‌బాబు 
సాక్షి, హైదరాబాద్‌: గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్‌ బాబు స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికీ నమ్మకం కలిగించిందని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో అసలు దోషులు, వారికి సహకరించిన అప్పటి ప్రభుత్వ పెద్దలకు శిక్ష పడితేనే వామన్‌రావు కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement