న్యూఢిల్లీ: అత్యాచారం, లైంగిక దాడి కేసుల్లో అవసరమని భావించిన పక్షంలో బాధితులకు పరిహారం కూడా చెల్లించేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం సెషన్స్ కోర్టులు, పోక్సో కోర్టులను ఆదేశించింది. ఈ విషయంలో అభిప్రాయం తెలపాల్సిందిగా శుక్రవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదే వన్‌ల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ(నల్సా)ను ఆదేశించింది.
అధికారుల నిర్లక్ష్యం, చిన్నచూపు కారణంగా అత్యాచార బాధితులకు న్యాయపరంగా దక్కాల్సిన పరిహారం దక్కడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన 25 ఏళ్ల మానసికలోపం కలిగిన బాధితురాలికి సీఆర్‌పీసీలోని 357ఏ ప్రకారం ఇవ్వాల్సిన పరిహారాన్ని అధికారులు నిరాకరిస్తున్నారని పిటిషన్‌దారు పేర్కొన్నారు. ఈ విషయంలో సెషన్స్ కోర్టులు లేదా స్పెషల్ కోర్టులు సరైన ఆదేశాలివ్వకపోవడం, అవగాహన లోపమే ఈ పరిస్థితికి కారణమని ధర్మాసనం తెలిపింది.


