ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేం | Supreme Court gives interim bail to 23-year-old influencer in molestation case | Sakshi
Sakshi News home page

ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేం

May 29 2025 3:04 AM | Updated on May 29 2025 3:04 AM

Supreme Court gives interim bail to 23-year-old influencer in molestation case

సుప్రీంకోర్టు స్పష్టీకరణ 

రేప్‌ కేసులో యువకుడికి మధ్యంతర బెయిల్‌

న్యూఢిల్లీ: ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అత్యాచారానికి గురైనట్లు చెబుతున్న 40 ఏళ్ల మహిళ చిన్నపిల్ల కాదని పేర్కొంది. ఆమె అంగీకారంతోనే లైంగిక చర్య జరిగిట్లు పరోక్షంగా వెల్లడించింది. అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 ఏళ్ల సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు న్యాయస్థానం బుధవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

 అతడిని అరెస్టు చేసి, జైల్లో పెట్టి తొమ్మిది నెలలు గడుస్తున్నా పోలీసులు అభియోగాలు నమోదు చేయలేదని, అందుకే మధ్యంతర బెయిల్‌ ఇస్తున్నట్లు పేర్కొంది. ఆ మహిళ ఆ యువకుడిని ఇష్టపూర్వకంగానే కలిస్తే అతడిపై రేప్‌ కేసు ఎలా నమోదు చేస్తారని ఢిల్లీ పోలీసులను జస్టిస్‌ బి.బి.నాగరత్న, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఆమె అతడితో ఏడుసార్లు జమ్మూకశ్మీర్‌కు వెళ్లిందని, అతడిపై సెక్షన్‌ కింద 376 కింద కేసు పెట్టడం సరైంది కాదని పేర్కొంది. 

ఈ కేసులో సదరు మహిళ దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. తమ దుస్తుల బ్రాండ్‌ ప్రచారం కోసం సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అయిన యువకుడిని సంప్రదించారు. క్రమంగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తనను మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఆ మహిళ ఫిర్యాదు చేయగా, ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. తనకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని యువకుడు కోరగా, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దాంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మధ్యంతర బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశాడు. సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే, బెయిల్‌పై బయట ఉన్నప్పుడు ఈ మహిళను కలవొద్దని షరతు విధించింది.  

Advertisement
 
Advertisement
Advertisement