40 మందిని బలిగొన్న గుంతల రోడ్లు, అక్రమ దాబాలపై సుప్రీంకోర్టు భగ్గు
తెలంగాణ, రాజస్తాన్ రోడ్డు ప్రమాదాలపై ఆగ్రహం
అసమర్థతకు పరాకాష్ట అంటూ హైదరాబాద్–బీజాపూర్ హైవే దుస్థితిపై తీవ్ర వ్యాఖ్యలు
ఎన్‌హెచ్‌ఏఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అల్టిమేటం
సాక్షి, న్యూఢిల్లీ: ’టోల్ ట్యాక్స్ వసూలు దేనికి? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటానికా?’అంటూ జాతీయ రహదారుల నిర్వహణపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ రహదారులపై పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ ధాబాలు, గుంతలమయంగా మారిన రోడ్ల వల్ల రెండు రోజుల్లో 40 మంది మరణించడంపై భగ్గుమంది. ‘ఇది అసమర్థతకు పరాకాష్ట.. భరించలేని దారుణం’అని తీవ్రంగా వ్యాఖ్యానించింది.
ఈ రోడ్డు ప్రమాదాలపై సుమోటోగా కేసు నమోదు చేసిన న్యాయస్థానం.. ఎన్‌హెచ్‌ఏఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రెండు వారాల్లోగా సమగ్ర నివేదికలతో తేల్చాలని అల్టిమేటం జారీ చేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ అంశంపై తీవ్రంగా స్పందించింది. ’రెండు రోజుల్లో రెండు భయంకరమైన ప్రమాదాలు.. 40 మంది చనిపోయారు. ఇది చాలా ఎక్కువ’అని జస్టిస్ మహేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ హైవే ప్రమాదానికి గుంతలే కారణం
నవంబర్ 3న హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 163)పై 20 మందిని బలిగొన్న ప్రమాదంపై ధర్మాసనం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ‘పత్రికా కథనాల ప్రకారం, హైవేపై ఉన్న ఓ పెద్ద గుంతను తప్పించే ప్రయత్నంలోనే లారీ అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. ఇది వ్యవస్థ వైఫల్యం కాదా?’అని ధర్మాసనం ప్రశ్నించింది.
’ప్రజల నుంచి టోల్ చార్జీలు వసూలు చేస్తున్నారు, కానీ రోడ్ల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. దెబ్బతిన్న, అసమానంగా ఉన్న రోడ్లపైనే ప్రయాణం సాగుతోంది. ఇది ఆమోదయోగ్యం కాదు’అని జస్టిస్ మహేశ్వరి తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ పరిధిలోని ఆ హైవేపై భద్రతా ప్రమాణాలు, కాంట్రాక్టర్ల పనితీరుపై తక్షణం ఆరా తీయాలని ఆదేశించారు.
యమపాశాలవుతున్న అక్రమ ధాబాలు
రాజస్తాన్‌లోని ఫలోడి వద్ద 18 మంది మృతికి అక్రమ ధాబాలే కారణమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘హైవేల పక్కన, నోటిఫై చేయని ప్రాంతాల్లో ఈ అక్రమ ధాబాలు వెలుస్తున్నాయి. ట్రక్కులను ప్రమాదకర రీతిలో రోడ్డుపైనే నిలిపివేస్తున్నారు. వేగంగా వచ్చే వాహనాలు వీటిని ఢీకొంటున్నాయి. దీనిని ఎలా నియంత్రిస్తారు?’అని ధర్మాసనం నిలదీసింది.
రెండు ప్రమాదాల్లోనూ రోడ్డు రూపకల్పనలో లోపాలు, సూచిక బోర్డులు లేకపోవడం, లైటింగ్ సరిగా లేకపోవడం వంటి అంశాలు వ్యవస్థాగత లోపాలను స్పష్టంగా సూచిస్తున్నాయని పేర్కొంది. ఈ కేసులో సమన్వయం కోసం కేంద్ర హోం శాఖను ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించింది. ప్రమాదాలు జరిగిన రెండు హైవేలు సాగుతున్న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకూ నోటీసులు జారీ చేసింది.
రెండు హైవేలపై ఉన్న అక్రమ ధాబాల జాబితా, రోడ్ల వాస్తవ పరిస్థితి, కాంట్రాక్టర్ల నిర్వహణ నిబంధనలపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఎన్‌హెచ్‌ఏఐ, కేంద్ర రోడ్డు రవాణా శాఖను ఆదేశించింది. రోడ్డు భద్రత అంశంపై కోర్టుకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది ఏఎన్‌ఎస్ నడ్కర్ణిని అమికస్ క్యూరీగా నియమించింది.


