సభా హక్కులు, వాక్ స్వాతంత్య్రం కేసు విచారణను ముగించిన సుప్రీంకోర్టు
2003 నాటి అసెంబ్లీ తీర్మానం ఉపసంహరణతో నిరర్థకమైన కేసు
భవిష్యత్తులో అవసరమైతే న్యాయపరమైన ప్రశ్నలను తేలుస్తామన్న సీజేఐ
అత్యల్పకాలంలో ముగిసిన ఏడుగురు జడ్జిల ధర్మాసనం విచారణగా రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల విశేషాధికారాలు (ప్రివిలేజెస్), పౌరుల వాక్ స్వాతంత్య్రం (ఆర్టికల్ 19(1)(ఎ)), జీవించే హక్కుల (ఆర్టికల్ 21) మధ్య తలెత్తిన విభేదాలపై సుప్రీంకోర్టులో దాదాపు రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కీలక కేసు విచారణకు తెరపడింది. ఈ వివాదానికి మూలమైన 2003 నాటి వివాదాస్పద తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ 2004లోనే ఉపసంహరించుకుంది. దీంతో కేసు విచారణనునిరర్థకమైనది (ఇన్‌ఫ్రక్ట్యుయస్)గా పరిగణిస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం లాంఛనంగా ముగించింది.
వివాదానికి కారణం
2003 ఏప్రిల్‌లో ‘ది హిందూ’దినపత్రికలో ప్రచురితమైన ‘రైజింగ్ ఇంటాలరెన్స్’(పెరుగుతున్న అసహనం) ఎడిటోరియల్ ఈ వివాదానికి కారణమైంది. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఆ ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా విమర్శిస్తూ రాసిన ఈ కథనంపై అసెంబ్లీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సభా కార్యకలాపాలను వక్రీకరించారని, ఇది సభా హక్కుల ఉల్లంఘనే అని పేర్కొంటూ 2003 నవంబర్ 7న అప్పటి స్పీకర్ కె.కాళిముత్తు అధ్యక్షతన అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. ఆ పత్రిక సంపాదకీయ సిబ్బందిని అరెస్టు చేయాలని అసెంబ్లీ తీర్మానం ఆమోదించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎడిటర్ ఎన్.రవి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మాలిని పార్థసారథి, బ్యూరో చీఫ్ వి.జయంత్, స్పెషల్ కరస్పాండెంట్ రాధా వెంకటేశన్, పబ్లిషర్ ఎస్.రంగరాజన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
అత్యున్నత న్యాయస్థానం జోక్యం
ఈ అరెస్టులను సవాలు చేస్తూ బాధితులంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ వైకే సభర్వాల్, జస్టిస్ ఎస్బీ సిన్హాల ధర్మాసనం 2003 నవంబర్ 10న అరెస్టులపై స్టే విధించింది. అయితే, ఆర్టికల్ 194 నిర్దేశించే చట్టసభల హక్కులకు, ఆర్టికల్ 19 కల్పించే వాక్ స్వాతంత్ర్యానికి మధ్య వైరుధ్యం తలెత్తినప్పుడు ఏది ప్రబలంగా ఉంటుందనే అంశంపై గతంలో సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పులు (పండిట్ ఎం.ఎస్.ఎం శర్మ వర్సెస్ శ్రీ కష్ణ సిన్హా కేసులో) వెలువరించింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగపరమైన ప్రశ్నలకు స్పష్టత ఇవ్వడం కోసం 2003 డిసెంబర్‌లో ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యవహారాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఆ తర్వాత భిన్నాభిప్రాయాల దృష్ట్యా సుప్రీంకోర్టు దీనిని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి అప్పగించింది.
2004లోనే ఉపసంహరణ
కేసును విచారించేందుకు సీజేఐ సూర్యకాంత్ నేతత్వంలో జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ పంచోలి, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ వి.మోహనలతో కూడిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటైంది. అక్టోబర్ 6వ తేదీన దీనిపై తుది విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, తమిళనాడు ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ సోమవారమే కీలక విషయాన్ని సీజేఐ దృష్టికి తీసుకొచ్చారు. జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటూ చేసిన తీర్మానాన్ని అసెంబ్లీ 2004లోనే రద్దు చేసిందని, దీనిపై అప్పట్లోనే కోర్టులో అఫిడవిట్ వేశామని గుర్తు చేశారు. ఈ విషయం అప్పట్లో న్యాయస్థానం దృష్టికి రాకపోవడంతో కేసు ఏళ్లుగా పెండింగ్‌లో ఉండిపోయింది. రాజు రామచంద్రన్ వాదనతో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఏకీభవించారు. అసలు తీర్మానమే మనుగడలో లేనప్పుడు కేవలం అకడమిక్ ప్రయోజనాల కోసం న్యాయస్థానం తన సమయాన్ని వెచ్చించబోదని ఈ సందర్భంగా సీజేఐ స్పష్టం చేశారు.
రికార్డు సృష్టించిన సుప్రీం
మంగళవారం విచారణ సందర్భంగా ఈ కేసును లాంఛనంగా ముగించినట్లు ధర్మాసనం ప్రకటించింది. అప్పటి తీర్మానాన్ని ఉపసంహరించు కున్నందున ప్రస్తుత పరిస్థితుల్లో విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, చట్టసభల విశేషాధికారాలు, పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన న్యాయపరమైన ప్రశ్నలను భవిష్యత్తులో సరైన కేసు వచ్చినప్పుడు పరిశీలిస్తామని వెల్లడించింది. సుప్రీంకోర్టు చరిత్రలో ఏడుగురు సభ్యుల ధర్మాసనం అత్యంత తక్కువ సమయం విచారణ జరిపి, అతి త్వరగా కేసును ముగించడం బహుశా ఇదే తొలిసారని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వ్యాఖ్యానించారు. కేసును మూసి వేసినప్పటికీ, చట్టసభల విశేషాధికారాల దుర్వినియోగం అంశం అత్యంత ప్రాముఖ్యత సంతరించు కున్నదని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ విచారణకు ముందు పత్రికా స్వేచ్ఛను అణిచివేసేలా సభా హక్కులను ఉపయోగించరాదని వాదిస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, ప్రముఖ జర్నలిస్టులు అజిత్ అంజుమ్, సీమా చిస్తీ, ధన్యా రాజేంద్రన్, పరన్‌జాయ్ గుహ తకుర్తా, కునాల్ కమ్రా, సుభాషిణి అలీ తదితరులు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం.


