breaking news
infructuous
-
సభా హక్కులు, వాక్ స్వాతంత్య్రం కేసు : రెండు దశాబ్దాల న్యాయ వివాదానికి తెర!
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల విశేషాధికారాలు (ప్రివిలేజెస్), పౌరుల వాక్ స్వాతంత్య్రం (ఆర్టికల్ 19(1)(ఎ)), జీవించే హక్కుల (ఆర్టికల్ 21) మధ్య తలెత్తిన విభేదాలపై సుప్రీంకోర్టులో దాదాపు రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కీలక కేసు విచారణకు తెరపడింది. ఈ వివాదానికి మూలమైన 2003 నాటి వివాదాస్పద తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ 2004లోనే ఉపసంహరించుకుంది. దీంతో కేసు విచారణనునిరర్థకమైనది (ఇన్ఫ్రక్ట్యుయస్)గా పరిగణిస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం లాంఛనంగా ముగించింది. వివాదానికి కారణం 2003 ఏప్రిల్‌లో ‘ది హిందూ’దినపత్రికలో ప్రచురితమైన ‘రైజింగ్ ఇంటాలరెన్స్’(పెరుగుతున్న అసహనం) ఎడిటోరియల్ ఈ వివాదానికి కారణమైంది. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఆ ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా విమర్శిస్తూ రాసిన ఈ కథనంపై అసెంబ్లీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సభా కార్యకలాపాలను వక్రీకరించారని, ఇది సభా హక్కుల ఉల్లంఘనే అని పేర్కొంటూ 2003 నవంబర్ 7న అప్పటి స్పీకర్ కె.కాళిముత్తు అధ్యక్షతన అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. ఆ పత్రిక సంపాదకీయ సిబ్బందిని అరెస్టు చేయాలని అసెంబ్లీ తీర్మానం ఆమోదించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎడిటర్ ఎన్.రవి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మాలిని పార్థసారథి, బ్యూరో చీఫ్ వి.జయంత్, స్పెషల్ కరస్పాండెంట్ రాధా వెంకటేశన్, పబ్లిషర్ ఎస్.రంగరాజన్లను పోలీసులు అరెస్టు చేశారు. అత్యున్నత న్యాయస్థానం జోక్యం ఈ అరెస్టులను సవాలు చేస్తూ బాధితులంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ వైకే సభర్వాల్, జస్టిస్ ఎస్బీ సిన్హాల ధర్మాసనం 2003 నవంబర్ 10న అరెస్టులపై స్టే విధించింది. అయితే, ఆర్టికల్ 194 నిర్దేశించే చట్టసభల హక్కులకు, ఆర్టికల్ 19 కల్పించే వాక్ స్వాతంత్ర్యానికి మధ్య వైరుధ్యం తలెత్తినప్పుడు ఏది ప్రబలంగా ఉంటుందనే అంశంపై గతంలో సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పులు (పండిట్ ఎం.ఎస్.ఎం శర్మ వర్సెస్ శ్రీ కష్ణ సిన్హా కేసులో) వెలువరించింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగపరమైన ప్రశ్నలకు స్పష్టత ఇవ్వడం కోసం 2003 డిసెంబర్లో ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యవహారాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఆ తర్వాత భిన్నాభిప్రాయాల దృష్ట్యా సుప్రీంకోర్టు దీనిని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి అప్పగించింది. 2004లోనే ఉపసంహరణ కేసును విచారించేందుకు సీజేఐ సూర్యకాంత్ నేతత్వంలో జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ పంచోలి, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ వి.మోహనలతో కూడిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటైంది. అక్టోబర్ 6వ తేదీన దీనిపై తుది విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, తమిళనాడు ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ సోమవారమే కీలక విషయాన్ని సీజేఐ దృష్టికి తీసుకొచ్చారు. జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటూ చేసిన తీర్మానాన్ని అసెంబ్లీ 2004లోనే రద్దు చేసిందని, దీనిపై అప్పట్లోనే కోర్టులో అఫిడవిట్ వేశామని గుర్తు చేశారు. ఈ విషయం అప్పట్లో న్యాయస్థానం దృష్టికి రాకపోవడంతో కేసు ఏళ్లుగా పెండింగ్‌లో ఉండిపోయింది. రాజు రామచంద్రన్ వాదనతో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఏకీభవించారు. అసలు తీర్మానమే మనుగడలో లేనప్పుడు కేవలం అకడమిక్ ప్రయోజనాల కోసం న్యాయస్థానం తన సమయాన్ని వెచ్చించబోదని ఈ సందర్భంగా సీజేఐ స్పష్టం చేశారు. రికార్డు సృష్టించిన సుప్రీం మంగళవారం విచారణ సందర్భంగా ఈ కేసును లాంఛనంగా ముగించినట్లు ధర్మాసనం ప్రకటించింది. అప్పటి తీర్మానాన్ని ఉపసంహరించు కున్నందున ప్రస్తుత పరిస్థితుల్లో విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, చట్టసభల విశేషాధికారాలు, పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన న్యాయపరమైన ప్రశ్నలను భవిష్యత్తులో సరైన కేసు వచ్చినప్పుడు పరిశీలిస్తామని వెల్లడించింది. సుప్రీంకోర్టు చరిత్రలో ఏడుగురు సభ్యుల ధర్మాసనం అత్యంత తక్కువ సమయం విచారణ జరిపి, అతి త్వరగా కేసును ముగించడం బహుశా ఇదే తొలిసారని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వ్యాఖ్యానించారు. కేసును మూసి వేసినప్పటికీ, చట్టసభల విశేషాధికారాల దుర్వినియోగం అంశం అత్యంత ప్రాముఖ్యత సంతరించు కున్నదని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ విచారణకు ముందు పత్రికా స్వేచ్ఛను అణిచివేసేలా సభా హక్కులను ఉపయోగించరాదని వాదిస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, ప్రముఖ జర్నలిస్టులు అజిత్ అంజుమ్, సీమా చిస్తీ, ధన్యా రాజేంద్రన్, పరన్జాయ్ గుహ తకుర్తా, కునాల్ కమ్రా, సుభాషిణి అలీ తదితరులు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం. -
మాల్యా కేసులో మా ఆర్డర్ ఫలించలేదు
బెంగళూరు: మద్యం వ్యాపారి విజయమాల్యాతో బ్రిటిష్ లిక్కర్ దిగ్గజం డియాజియో ఒప్పందం మేరకు అతనికి తొలివిడతగా ఇవ్వాల్సిన 40 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.270 కోట్లు)ను నిలిపివేయాలన్న రుణ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలు వ్యర్థమయ్యాయని డీఆర్టీ ప్రిసైడింగ్ ఆఫీసర్(పీఓ) సీఆర్ బెనకనహళ్లి తెలిపారు. మార్చి 7 న జారీచేసిన ఈ ఆదేశాలకు ముందే సదరు మొత్తం మాల్యా బ్యాంక్ ఖాతాలో జమఅయ్యాయని వెల్లడించారు. ముంబై సర్వీస్ టాక్స్ డిపార్ట్ మెంట్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఆయన ఆ విషయాన్ని వెల్లడించారు. మార్చి 7 ట్రిబ్యునల్ ఆర్డర్ కంటే చాలా ముందుగానే బదిలీ జరగడంతో తమ ఆదేశాలు ఫలించలేదని తెలిపారు. ఒప్పందం ప్రకారం మాల్యా ఖాతాలోఆ సొమ్ము మొత్తం జమ అయ్యాయన్నారు. అలాగే ట్రిబ్యునల్ నిబంధనలు, షరతులు ప్రకారం , మిగిలిన 35 మిలియన్ డాలర్ల చెల్లింపును నిలిపివేయమని ఆదేశించలేమన్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో వారి ఒప్పందం అమల్లో ఉంటుంది గనుక అటు మాల్యాకు గానీ, డియాజియో కు ఈ తరహా ఆదేశాలివ్వలేమని బెనకనహళ్లి స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలోరుణాలు తీసుకుంటున్న సమయంలో బ్యాంకులు రుణదాత(మాల్యా), ఆయనకు సంబంధించి కంపెనీలకు ఉన్న ఆస్తుల వివరాలతో కూడిన డిక్లరేషన్‌ను ఎందుకు అడగలేదని బ్యాంకులకు మొట్టికాయలు వేసిన బెనహనకల్లి తాజాగా టాక్స్ డిపార్ట్ మెంట్ వైఖరిని కూడా దుయ్యబట్టారు. ఎటాచ్ చేయబడిన మాల్యా స్థిర,చరాస్తులను ఎందుకు విక్రయించలేదని సేవా పన్ను శాఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇల్లు, విమానం, హెలికాప్టర్లు అమ్మకం ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. అనంతరం తదుపరి విచారణను ఇవాల్టికి(14 జూలై గురువారం) వాయిదా వేశారు. డియోజియో కంపెనీమాల్యాకు చెల్లించాల్సిన ఒప్పంద మొత్తాన్ని చెల్లించవద్దని ఇటివల డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ) ఆదేశించింది. మరోపక్క, మాల్యా బ్యాంక్ ఖాతాకు సంబంధించిన స్టేట్మెంట్ వివరాలను తమకు సమర్పించాలని న్యూయార్క్‌కు చెందిన జేపీ మోర్గాన్ బ్యాంకుకు కూడా డీఆర్టీ ఆదేశాలు జారీ చేసింది. మాల్యా యూబీ గ్రూప్ కంపెనీ అయిన యునెటైడ్ స్పిరిట్స్‌లో మెజారిటీ వాటాను డియాజియో 2012లో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. కంపెనీ డెరైక్టర్ల బోర్డు నుంచి పూర్తిగా వైదొలగే షరతుపై మాల్యా 75 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.500 కోట్లు) చెల్లించే విధంగా డియాజియో ఒప్పందాన్నిప్రకారం ముందస్తుగా 40 మిలియన్ డాలర్లను చెల్లించేందుకు ఒప్పుకుంది. అయితే, ఈ మొత్తం తమకే చెందాలని.. రూ. వేల కోట్లు బకాయిలు పడిన మాల్యాకు ఈ సొమ్మును డియాజియో చెల్లిం చకుండా ఆదేశించాలంటూ ఎస్బీఐ కాన్సార్షియం డీఆర్టీని ఆశ్రయించింది.ఈ నేపథ్యంలోఆ చెల్లింపులను నిలిపివేయాలని డియోజియోను డీఆర్ టీని ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే.


