
ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: రష్యా మహిళ, ఆమె కుమార్తె కనిపించకుండా పోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీని వెనుక కుట్ర కోణం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా ఆమెకు ఎవరో సాయం చేసి ఉండొచ్చని పేర్కొంది. లుకౌట్ నోటీసు జారీ చేసి, తల్లి, కుమార్తె జాడను త్వరగా తెలుసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
సైకత్ బసు అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా శుక్రవారం జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చిల ధర్మాసనం పైవిధంగా స్పందించింది. రష్యా పౌరురాలైన తన మాజీ భార్య విక్టోరియా బసు, నాలుగున్నరేళ్ల చిన్నారి ఈ నెల 7వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ సైకత్ బసు పేర్కొన్నారు. పోలీసులు లుఔట్ నోటీసు జారీ చేశారని, రష్యా ఎంబసీతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి ధర్మాసనానికి నివేదించారు.
ఈ నెల 6న ఆమెకున్న కెనరా బ్యాంక్ అకౌంట్‌లో కేవలం రూ.169 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిసిందన్నారు. ఆమె దేశం విడిచి వెళ్లినట్లు ఎయిర్‌పోర్టుల్లో నమోదు కాలేదని వివరించారు. స్పందించిన ధర్మాసనం..విక్టోరియా బసు వేరే మార్గాల ద్వారా దేశం దాటి వెళ్లి ఉండొచ్చని అభిప్రాయపడింది. అన్ని రైల్వే స్టేషన్లు, ఇతర రవాణా వ్యవస్థల నుంచి సమాచారం సేకరించాలని, ఢిల్లీని విడిచారా లేదా నిర్థారించాలని ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే వారి జాడ కనుగొనాలంది. సుప్రీంకోర్టు గత ఆదేశాల మేరకు సైకత్, విక్టోరియా దంపతులు చిన్నారి సంరక్షణను వారంలో చెరో మూడు, నాలుగు రోజులు తీసుకోవాల్సి ఉంది. అయితే, ఈ నెలారంభంలో ఢిల్లీలోని రష్యా ఎంబసీ వెనుక వైపు నుంచి ఓ దౌత్యాధికారి వెంట కూతురిని తీసుకుని వెళ్లిన విక్టోరియా జాడ మళ్లీ కనిపించలేదని సైకత్ పేర్కొన్నారు. కుమార్తె సహా ఆమె భారత్ విడిచి వెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.