Live: ముగిసిన కేబినెట్ భేటీ | Sakshi
Sakshi News home page

Live: ముగిసిన కేబినెట్ భేటీ

Published Mon, Sep 18 2023 10:44 AM

Parliament Special Sessions Live Updates - Sakshi

Updates..

►కేబినెట్ భేటీ ముగిసింది. ఏ అంశంపై చర్చించారనే విషయం బయటకు వెలువరించలేదు. పలు కీలక బిల్లులపై చర్చ జరిగినట్లు సమాచారం. రేపటి నుంచి పార్లమెంట్ కొత్త భవనంలో నిర్ణయాత్మకమైన బిల్లులపై చర్చ జరగనుంది.

►పార్లమెంట్‌ భవనంలో కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం అయింది.

► ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. రేపు మధ్యాహ్నం 1:15 గంటలకు లోక్‌ సభ, 2:15 గంటలకు రాజ్య సభ ప్రారంభం అవుతాయని స్పీకర్ వెల్లడించారు.

►ప్రధాని మోదీ నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 6:30కు ప్రారంభం కానున్న కెబినెట్ భేటీకి ముందు కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశాలు నిర్వహించారు. అమిత్‌ షాతో భేటీ అనంతరం ఇద్దరు కేంద్ర మంత్రులతో సమావేశం జరిపారు. కేంద్ర మంత్రుల భేటీ అజెండాపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎలాంటి ముందస్తు నోట్‌ లేకుండానే కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. 

► చంద్రబాబు అరెస్టుపై లోక్‌సభలో టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ తప్పుడు ప్రచారాన్ని అడ్డుకున్న వైఎస్ఆర్సీపి ఎంపీలు మిథున్ రెడ్డి, మార్గాన్ని భరత్. స్కిల్ స్కాంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని లోక్ సభలో మిథున్ రెడ్డి అన్నారు. ఫేక్ జీవోలు ఇచ్చి, రూ.371 కోట్ల రూపాయల లూటీ చేశారని మండిపడ్డారు. దోచిన మొత్తాన్ని 80 షెల్ కంపెనీలకు పంపారని అన్నారు.  ఈ కేసులో నగదు ఎక్కడెక్కడికి వెళ్లిందో ఈడీ స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. చిట్టచివరికి చట్టానికి చంద్రబాబు చిక్కారు. ఐటీ కేసులో సైతం నోటీసులు అందుకున్నారని తెలిపిన మిథున్ రెడ్డి.. చంద్రబాబు పీఏ దేశం విడిచి పారిపోయాడని చెప్పారు. 

► కొత్త పార్లమెంట్‌లోనైనా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఫన్నీగా ఉన్నాయని చెప్పారు. విశ్వాసమున్న నేతలనే ప్రజలు నమ్ముతారని అన్నారు. సీఎం కేసీఆర్‌ను ప్రజలు మూడోసారి ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

► పాత పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఎంపీ నామా నాగేశ్వర్ రావు అన్నారు. తెలంగాణ ఏర్పాటు చేదు  అనుభవం మిగిల్చిందని ప్రధాని మోడీ అన్నట్లు గుర్తు చేసిన నామా.. ప్రస్తుతం తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్‌లో అడుగుపెట్టి అందర్ని కూడగట్టారని సీఎం కేసీఆర్‌ని కొనియాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, బీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. 

► సాయంత్రం 6:30 కు పార్లమెంట్ భవనంలో కేంద్ర క్యాబినెట్ సమావేశం కానుంది. నూతన బిల్లులపై చర్చించే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

► పార్లమెంటు రాజ్యాంగ సభ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 

► 75 ఏళ్ల పార్లమెంటు ప్రస్థానంపై లోక్ సభలో చర్చ జరిగింది. వైఎస్ఆర్సీపి తరఫున చర్చలో పాల్గొన్న ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా హామీ ఇచ్చి పదేళ్లు గడుస్తున్న ఇంకా ఇవ్వలేదని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం గొప్ప పరిణామం అని అన్నారు. పార్లమెంటు పని దినాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలకు 30శాతం సమయం కేటాయించాలని కోరారు. 

► పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ సెషన్‌లోనే బిల్లును ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాల డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నెల 20న మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో  కొంత కాలంగా పెండింగ్‌లో ఉంది. 

► పార్లమెంట్‌ ఎదుట గాంధీ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసన. 

► కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఈ భవనం చాలా జ్ఞాపకాలతో నిండి ఉంది, ఇది చరిత్రతో నిండి ఉంది. ఇది విచారకరమైన క్షణం. కొత్త భవనంలో మెరుగైన సౌకర్యాలు, కొత్త సాంకేతికత, మరిన్ని సౌకర్యాలు ఉండాలని ఆశిద్దాం. పార్లమెంట్ సభ్యులు.. చరిత్ర, జ్ఞాపకాలతో నిండిన భవనాన్ని విడిచిపెట్టడం ఎల్లప్పుడూ భావోద్వేగ క్షణం అని అన్నారు. 

► రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసనలు చేపట్టారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు, బీసీ రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టాలని నిరసనలు తెలిపారు. 

► లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన సమయమిది. చారిత్రక పార్లమెంట్‌ భవనానికి వీడ్కోలు పలుకుతున్నాం. ఈ 75 ఏళ్ల ప్రయాణం ఎంతో గర్వకారణమైంది. ఈ ప్రయాణంలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాం. భారతీయులు స్వేదం, డబ్బుతో ఈ భవనాన్ని నిర్మించాం. ఈ పార్లమెంట్‌ భవనం మనల్ని ఎప్పుడూ ఉత్తేజపరుస్తూనే ఉంటుంది. మనం కొత్త భవనంలోకి వెళ్తునప్పటికీ పాత భవనం భావితరాలకు స్ఫూర్తినిస్తుంది. చంద్రయాన్‌-3 విజయం దేశాన్ని సాంకేతికంగా అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తుంది. ఇది మన శాస్త్రవేత్తల సామర్థ్యానికి ప్రతీక. చంద్రయాన్‌-3 విజయంతో మన సత్తా చాటాం. భారత్‌ అభివృద్ధి ప్రపంచమంతా ప్రకాశిస్తోంది. 

► ఈ భవనానికి వీడ్కోలు పలకడం భావోద్వేగానికి గురిచేస్తోంది. పాత పార్లమెంట్‌తో ఎంతో అనుబంధం ఉంది. పార్లమెంట్‌లో తొలిరోజు నేను భావోద్వేగానికి గురయ్యాను. ప్రజల సందర్శనకు పాత పార్లమెంట్‌ భవన్‌ తెరిచే ఉంటుంది. ప్రారంభంలో మహిళా ఎంపీల సంఖ్య తక్కువగా ఉండేది. క్రమంగా వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.  

► పార్లమెంట్‌లోకి వెళ్తే గుడిలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ప్రజాస్వామ్యానికి జీవాత్మలాంటిదైన పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడిని భారత్‌ ఎప్పటికీ మరిచిపోదు. ఉగ్రదాడి నుంచి పార్లమెంట్‌ను రక్షించిన సైనికులకు సెల్యూట్‌.  ఇంద్రజిత్‌ గుప్తా 43 ఏళ్లు ఈ భవనంలో సేవలందించారు. దళితులు, ఆదివాసీ, మధ్య తరగతి మహిళలకు ఈ సభ అవకాశమిచ్చింది. 

► నెహ్రు, అంబేద్కర్‌ నడయాడిన సభ ఇది. ఓ పేదవాడు పార్లమెంట్‌లో అడుగుపెడతారని ఎవరైనా ఊహించారా?. నెహ్రు నుంచి మన్మోహన్‌ సింగ్‌ వరకూ ఎందరో ప్రధానులు సమావేశాలకు నాయకత్వం వహించారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వంటి మన హీరోలను గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. ఈ 75ఏళ్లలో 7500 మంది ఎంపీలు, 17 మంది స్పీకర్లు పనిచేశారు. 

► 1996లో పార్లమెంట్‌లో వాజ్‌పేయి ప్రసంగం పాపులర్‌ అయ్యింది. నెహ్రు, వాజ్‌పేయి ప్రసంగాలు పార్లమెంట్‌లో ప్రతిధ్వనిస్తుంటాయి. ఈ పార్లమెంట్‌లోనే ఆర్టికల్‌ 370 రద్దు చేశాం. వన్‌ నేషన్‌-వన్‌ ట్యాక్స్‌ తీసుకొచ్చింది ఇక్కడే. జీఎస్టీకి తీర్మానం చేశాం. తెలంగాణ ఏర్పాటు కూడా ఈ భవనంలోనే జరిగింది. 

సమిష్టి కృషి వల్లే జీ20 విజయవంతం..
► సమిష్టి కృషి వల్లే జీ20 విజయవంతమైంది.  భారత్‌ నిర్మాణాన్ని గర్వంగా చెప్పుకోవాలి. జీ20 విజయం దేశ ప్రజలందరిది. జీ20 విజయాన్ని ప్రపంచం మొత్తం కీర్తిస్తోంది. జీ20 విజయం ఫెడరల్‌ స్ఫూర్తికి నిదర్శనం. జీ20లో ఆఫ్రికా యూనియన్‌ను భాగస్వామిని చేశాం. అనేక రంగాల్లో భారత్‌ గణనీయంగా అభివృద్ధి చెందింది.  భారత్‌ ఇప్పుడు అన్ని దేశాలకు విశ్వమిత్రగా మారుతోంది. 

►ప్రత్యేక సమావేశాల సందర్బంగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా జీ20 సక్సెస్‌ను సభకు వివరించారు. లోక్‌సభలో  ఓం బిర్లా మాట్లాడుతూ.. జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించుకున్నాం. జీ20 విజయవంతం దేశ ప్రజలందరికీ గర్వకారణం. గ్లోబల్‌ ఆఫ్‌ ది సౌత్‌ వాయిస్‌ను భారత్‌ వినిపించింది.  ప్రపంచ దేశాలు భారత్‌ను మెచ్చుకున్నాయి. జీ20 కీలక నిర్ణయాలు తీసుకుంది. మోదీ సమర్థతతోనే జీ20 విజయవంతమైంది. భారత్‌-యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ ఏర్పాటు విప్లవాత్మక చర్య.

► రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ ఎంపీ దినేశ్‌ శర్మ ప్రమాణం చేశారు. 

► లోక్‌సభ ప్రారంభంలోనే టెక్నికల్‌ ఇష్యూ కారణంగా సభలో కాసేపు గందరగోళం నెలకొంది. 

►పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  ఐదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు జరుగునున్నాయి. ఈ సమావేశాల్లో పార్లమెంట్‌ ప్రస్థానంపై ఉభయసభల్లో చర్చ జరుగనుంది. 

►  పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ ఎంపీలు.

► పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ. 

► పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ఇండియా కూటమి సభ్యులు పాల్గొననున్నారు. ఈ సందర్బంగా అవసరమైన విషయాలపై తమ వాదనలు వినిపించనున్నారు. 

జీ20 సక్సెస్‌ భారత్‌కు గర్వకారణం: మోదీ
► పార్లమెంట్‌లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఈ పార్లమెంట్‌ భవనం చారత్రక కట్టడం. పార్లమెంట్‌ దేశ ప్రతిష్టను పెంపొందించింది. పార్లమెంట్‌ భవనంపై మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలి. పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితులు లేకుండా సజావుగా జరుపుకుందాం.  పాత పార్లమెంట్‌లో ఇది చివరి సమావేశం. రేపటి నుంచి కొత్త పార్లమెంట్‌లో సమావేశాలు జరుగుతాయి.

► వినాయక చతుర్థి సందర్భంగా కొత్త పార్లమెంట్‌లో అడుగుపెడుతున్నాం. ఎలాంటి విఘ్నాలు కలుగకుండా గణేషుడు చూడాలని ప్రార్థిస్తున్నాను.


► సకల వసతులతో యశోభూమిని నిర్మించుకున్నాం. యశోభూమి అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ కూడా నిన్న దేశానికి అంకితం చేయబడింది. చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో భారత్‌ జెండా చంద్రుడిపై రెపరెపలాడుతోంది. శివశక్తి పాయింట్ కొత్త స్ఫూర్తి కేంద్రంగా మారింది. తిరంగా పాయింట్ మనలో గర్వాన్ని నింపుతోంది. ఇటువంటి భారత్‌ కీర్తి పెంచుతున్నాయి. దీంతో, అనేక అవకాశాలు భారత్‌ ముందుకు వస్తున్నాయి. 

► జీ20 విజయాన్ని ప్రపంచాధినేతలు ప్రశంసించారు. భారత్‌ సత్తా ఏంటో చూపించాం. భారత్‌ పురోగతిని ప్రపంచమంతా కొనియాడుతోంది. జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించాం. ఆధునిక భారత్‌ సాకారమవుతోంది. భారత్‌ పురోగతిని ప్రపంచం కొనియాడుతోంది. ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్యత్వం పొందినందుకు భారత్‌ ఎప్పుడూ గర్వపడుతుంది. ఇవన్నీ భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతం.

►  పార్లమెంట్‌ వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ..

సాక్షి, ఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరుగునున్నాయి. ప్రత్యేక సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలు లేకుండానే నేరు పార్లమెంట్‌ సమావేశాలు స్టార్ట్‌ అవనున్నాయి. ఈ సందర్భంగా 75 ప్రస్థానంపై చర్చ జరుగనుంది. 

► ఈ క్రమంలో పార్లమెంట్‌ 75 ఏళ్లలో సాధించిన విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, పాఠాలు అనే అంశంపై చర్చ జరుగనుంది. 

►  ఇక, రేపు కొత్త పార్లమెంట్‌ భవనంలోకి ప్రవేశం జరుగుతుంది. 
 
►  రేపు ఉదయాన్నే 9:30 గంటలకు ఎంపీలతో గ్రూప్‌ ఫొటో ఉంటుంది. 

Advertisement
Advertisement