పతనంతిట్ట(కేరళ): రాబోయే శబరిమల యాత్రా కాలంలో పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని శబరిమల అయ్యప్ప యువ సేవా సమితి (ఎస్‌ఏవైఎస్‌ఎస్)జిల్లా యంత్రాంగాన్ని కోరింది. పతనంతిట్ట జిల్లా కలెక్టర్ నిజాముద్దీన్ ఈ అభ్యర్థనను.. అవసరమైన చర్యల కోసం తిరువనంతపురంలోని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కమిషనర్‌కు, శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు, తిరువనంతపురంలోని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పంపారు. కలెక్టర్ ఎస్‌ఏవైఎస్‌ఎస్ రాసిన లేఖలో లక్షలాది మంది భక్తులు ఈ యాత్రను చేపట్టే అవకాశం ఉందని, భారీ క్యూలు, ఎక్కువసేపు వేచి ఉండటం కారణంగా పిల్లలు, వృద్దులు ఇబ్బందులు ఎదుర్కోవచ్చని పేర్కొంది. అందుకే వారికి ప్రత్యేక సౌకర్యాలు అందించాలని కోరింది.
ప్రధాన పుణ్యక్షేత్రాల వద్ద వృద్ధులకు, చిన్న పిల్లలతో ప్రయాణించే కుటుంబాలకు దర్శనంలో ప్రాధాన్యత కల్పించాలని కోరింది. వారికి కూర్చునే ఏర్పాట్లు, తాగునీరు, విశ్రాంతి ప్రదేశాలు, వైద్య సహాయం కల్పించాలని తెలిపింది. వైద్య కేంద్రాలు, మరుగుదొడ్లు, తాగునీటి పాయింట్లు, అన్నదానం సౌకర్యాలు, పార్కింగ్ ప్రాంతాలు, అత్యవసర సేవలు, ఇతర అవసరమైన సౌకర్యాల గురించి సమాచారం అందించే సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని ఎస్‌ఏవైఎస్‌ఎస్ కోరింది. యాత్రా సమయానికి ముందే ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని, సంబంధిత విభాగాలు, అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఏవైఎస్‌ఎస్ ఛైర్మన్ ఎల్ శ్రీనివాస్ జిల్లా యంత్రాంగాన్ని కోరారు.
ఇదీ చదవండి: ‘హనుమాన్ అంశ్’ ప్రభావం.. కైంచీ ధామ్‌లో అనూహ్య రద్దీ!


