ఆయనతోపాటు కుమారుడికి ఏడేళ్ల జైలు
పాన్ కార్డు కేసులోప్రత్యేక న్యాయస్థానం తీర్పు
రాంపూర్(యూపీ): సీతాపూర్ జైలు నుంచి విడుదలై రెండు నెలలయినా కాకమునుపే సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత మహ్మద్ ఆజం ఖాన్ మళ్లీ జైలుకు వెళ్లారు. రెండు వేర్వేరు పుట్టిన తేదీలతో రెండు పాన్ కార్డులను కలిగి ఉన్నట్లు నమోదైన 2019నాటి కేసులో సోమవారం కోర్టు ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించడంతో ఊచలు లెక్కబెట్టక ఆయనకు తప్పింది కాదు. రాంపూర్‌లోని ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక న్యాయస్థానం ఆజం ఖాన్ కుమారుడు, ఎమ్మెల్యే అబ్దుల్లా ఖాన్‌కు కూడా ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
ఆజం ఖాన్, అబ్దుల్లా ఖాన్‌లు తప్పు చేసినట్లు ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయని తీర్పు వెలువరించిన స్పెషల్ మేజిస్ట్రేట్ శోభిత్ బన్సాల్ పేర్కొన్నారు. తీర్పు అనంతరం పోలీసులు ఇద్దరినీ పటిష్ట బందోబస్తు నడుమ రాంపూర్ కోర్టు నుంచి జిల్లా జైలుకు తీసుకెళ్లారు. ‘ఇందులో చెప్పడానికి ఏముంటుంది? ఇది న్యాయస్థానం నిర్ణయం. తప్పుచేసినట్లు న్యాయమూర్తులు భావిస్తే జైలు శిక్ష వేస్తారు’అని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. కాగా, జ్యుడిషియల్ కస్టడీలో ఇప్పటికే ఆజం ఖాన్ చాలా సమయం గడిపినందున శిక్షా కాలం తగ్గొచ్చని లాయర్లు తెలిపారు.
ఆయనకు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు. భూ ఆక్రమణ, లంచం, మోసం తదితర ఆరోపణలపై ఆజం ఖాన్‌పై మొత్తం 84 కేసులున్నాయి. ఆయన దోషిగా నిరూపితమైన నాలుగో కేసు ఇది. నాలుగు కేసుల్లో ఆయనకు విముక్తి లభించింది. మిగతా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఓ కేసులో 23 నెలలు జైలు జీవితం గడిపిన ఆజం ఖాన్ సెప్టెంబర్ 23వ తేదీన విడుదలయ్యారు. అంతకుముందు కూడా ఆయన 27 నెలలు జైలులోనే ఉన్నారు. పాన్ కార్డ్ కేసులో తమ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్, ఆయన కుమారుడికి ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించడంపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. బీజేపీ పాలనలో అణచివేత, అన్యాయాలకు ఇది పరాకాష్ట అని ఆయన పేర్కొన్నారు. అధికారముందనే అహంకారంతో విర్రవీగే వారికి చివరికి దుర్గతే పడుతుందని, ప్రజలు అంతా గమనిస్తూనే ఉంటారని వ్యాఖ్యానించారు.


