
పంచకుల: హర్యానాలోని పంచకుల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. డెహ్రాడూన్(Dehradun)కు చెందిన ఒకే కుటుంబంలోని ఏడుగురు సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణమని వెల్లడయ్యింది. కుటుంబ యజమాని ప్రవీణ్ మిట్టల్‌పై దాదాపు రూ. 20 కోట్ల అప్పుల భారం ఉన్నట్లు సమాచారం. ప్రవీణ్ రాసిన సూసైడ్ లేఖలో తమ బంధువు సందీప్ అగర్వాల్ ద్వారా తమ అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు.
ప్రవీణ్ మిట్టల్ స్వస్థలం హిసార్‌లోని బార్వాలా. అయితే గత రెండేళ్లుగా ఆయన పంచకులలోని సాకేత్రి ప్రాంతంలో నివసిస్తూ, టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం మిట్టల్ హిమాచల్ ప్రదేశ్‌లోని స్క్రాప్ ఫ్యాక్టరీని నిర్వహించారు. అప్పులు పెరగడంతో బ్యాంకు ఆ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంది. తాజాగా మిట్టల్ కుటుంబ సభ్యులంతా బాగేశ్వర్ ధామ్‌లో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడి నుంచి తిరిగి వస్తూ వారు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి తన కారు వెనుక ఉత్తరాఖండ్ నంబర్ ప్లేట్(Uttarakhand number plate) ఉన్న కారు నిలిపి ఉండటాన్ని గమనించి, లోనికి చూడగా, ఈ ఉదంతం వెలుగు చూసింది. ఆ సమయంలో కారులో నుంచి దుర్వాసన వస్తోంది. అప్పుడు ఆ వ్యక్తి కారులోని ప్రవీణ్ మిట్టల్‌తో ఏం జరిగిందని అడిగాడు. దీనికి మిట్లల్ సమాధానమిస్తూ తమ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నదని, ఐదు నిమిషాల్లో తాను కూడా చనిపోతానని, తాము భారీగా అప్పుల్లో కూరుకుపోయామని చెప్పాడని ఆ వ్యక్తి మీడియాకు తెలిపారు. వెంటనే స్పందించిన స్థానికులు కుటుంబ సభ్యులందరినీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే వారంతా మృతిచెందారని వైద్యులు తెలిపారు. అంబులెన్స్ సమయానికి వచ్చి ఉంటే ప్రవీణ్ మిట్టల్‌ను రక్షించి ఉండేవాడినని కారును గమనించిన వ్యక్తి తెలిపాడు.
అనుమానాస్పద స్థితిలో..
పంచకులలోని సెక్టార్ 27లోని ఒక ఇంటి వెలుపల రోడ్డుపై ఆపి నిలిపివుంచిన కారులో ఏడుగురి మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. ఆర్థిక పరమైన ఇబ్బందుల కారణంగా కుటుంబంలోని ఏడుగురు సభ్యులు బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంటిపెద్ద, డెహ్రాడూన్ నివాసి ప్రవీణ్ మిట్టల్ (42), అతని తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఏడు మృతదేహాలను పంచకులలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.
ఈ ఉదంతంపై సమాచారం అందుకున్న పంచకుల డీసీపీ హిమాద్రి కౌశిక్, డీసీపీ (శాంతిభద్రతలు) అమిత్ దహియా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని, మరింత విశ్లేషణ కోసం ఆధారాలను సేకరించింది. పంచకుల డీఎస్‌పీ హిమాద్రి కౌశిక్ మాట్లాడుతూ తమ ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని, మృతదేహాలు లభ్యమైన కారును పూర్తిగా స్కాన్ చేస్తున్నామని అన్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.