రక్తంలో చక్కెర స్థాయిలు అధికం
మధుమేహం బారిన 28.4% మంది
27.5% మందికి పొంచి ఉన్న ముప్పు
ఫార్మ్‌ఈజీ అధ్యయనంలో సంచలన విషయాలు
మధుమేహం (డయాబెటిస్)..దీనికి సైలెంట్ కిల్లర్ అనే పేరుంది. ఈ వ్యాధి బారిన పడ్డవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 83 కోట్లు దాటిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. అయితే మన దేశంలో అధికంగా మధుమేహ రోగులుండటం ఆందోళన కలిగించే అంశం. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం 20 ఏళ్లకు పైబడిన వారిలో 10 కోట్ల మందికి పైగా డయాబెటిస్ పేషెంట్లు ఉన్నట్టు అంచనా.
మరో 13.6 కోట్ల మందికి మధుమేహం ముప్పు పొంచి ఉంది. అయితే చాలామందికి తమకు వచ్చే ప్రమాదం గురించి తెలియడం లేదు. అంతేకాదు డయాబెటిస్ ప్రాబల్యం విషయంలో భారతదేశం ప్రపంచ సగటు కంటే చాలా ముందుండడం ఆందోళన కలిగిస్తోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్
ప్రీ డయాబెటిస్‌కు దారి..
పరీక్షించినవారిలో 58% మందికి ఇన్సులిన్ నిరోధకత ఉందని హెచ్‌ఓఎంఏ–ఐఆర్ ఫలితాలు సూచిస్తున్నాయి. ఇది జీవక్రియ ప్రమాదానికి ముందస్తు గుర్తు. ఇన్సులిన్ నిరోధకత అనేది శరీర కణాలు ఇన్సులిన్ అనే హార్మోన్‌కు సరిగ్గా స్పందించని ఒక పరిస్థితి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
పాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్ సాధారణంగా ఆహారం నుండి లభించే గ్లూకోజ్‌ను శక్తి కోసం కణాలలోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది. అయితే నిరోధకత ఏర్పడినప్పుడు గ్లూకోజ్ రక్త ప్రవాహంలోనే ఉంటుంది. దానిని భర్తీ చేయడానికి పాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే అది ప్రీ డయాబెటిస్‌కు దారితీస్తుంది. చివరికి టైప్–2 డయాబెటిస్‌కు కారణం అవుతుంది.
డయాబెటిస్ ఉన్న వ్యక్తులలో..
» నలుగురిలో ఒకరికి అసాధారణ రీతిలో థైరాయిడ్ (హైపోౖథెరాయిడిజం)
» ముగ్గురిలో ఒకరికి కాలేయ పనితీరులో సమస్యలు
» దాదాపు సగం మందికి ఏదో ఒక రకమైన మూత్రపిండాల బలహీనత
» సుమారు 90% మందికి అసాధారణ లిపిడ్ ప్రొఫైల్స్ ఉంటాయి.
» 30 ఏళ్లలోపు వారిలోనూ రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నాయి.
» 30–39 సంవత్సరాల మధ్య వయస్కుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఇప్పటికే అధిక చక్కెర స్థాయిలు.
» 60 ఏళ్లుపైబడ్డవారిలో ప్రతి 10లో 8 మంది రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిలు ఉంటున్నాయి.
చిన్న వయస్సు వారిపైనా ప్రభావం
డిజిటల్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్ ఫార్మ్‌ఈజీ అధ్యయనం ప్రకారం భారత్‌లో ఇద్దరిలో ఒకరికి రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నట్టు నిర్ధారణ అయింది. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 40 లక్షలకు పైగా రోగ నిర్ధారణ నివేదికలు, 1.9 కోట్ల ఔషధ ఆర్డర్లను కంపెనీ విశ్లేషించింది. ‘డయాబెటిస్: ది సైలెంట్ కిల్లర్ స్వీపింగ్ ఎక్రాస్ ఇండియా’పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. 28.4% మందికి మధుమేహం నిర్ధారణ అయింది.
27.5% మందికి ముప్పు పొంచి ఉంది. అంటే వీరు టైప్–2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యాధి వృద్ధులను మాత్రమే కాకుండా చిన్న వయస్సు వారిని కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండడం 90% మందిలో కాలేయం, లిపిడ్ (కొవ్వులు, నూనె, హార్మోన్లు), గుండె, థైరాయిడ్ సమస్యలకు దారితీసిందని నివేదిక తెలిపింది.
సగం మందికి తెలియదు..
స్పష్టమైన లేదా ముందస్తు లక్షణాలు లేకుండానే జనం డయాబెటిస్ బారిన పడుతున్నారు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తున్నారు. వయస్సు, లింగం, జీవనశైలి, ప్రాంతంతో సంబంధం లేకుండా ఇది ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. ఆందోళన కలిగించే ముఖ్య విషయం ఏమిటంటే 50% కంటే ఎక్కువ మందికి తాము ఈ వ్యాధిబారిన పడ్డ విషయం తెలియకపోవడం.
గుండె జబ్బులు, మూత్రపిండాలు దెబ్బతినడం, దృష్టి కోల్పోవడం వంటి సమస్యలు వచ్చే వరకు ఈ వ్యాధి బయటపడడం లేదట. సాధారణ రక్త పరీక్ష ద్వారా ముందస్తుగా గుర్తించి సకాలంలో వైద్యం తీసుకోవడమే ఉత్తమ మార్గం అని నిపుణులు చెబుతున్నారు.


