కనీస మానవత్వాన్ని మంట కలుపుతూ మనుషుల మధ్య సంబంధాలు నానాటికి దిగజారిపోతున్నాయి. స్వల్ప వివాదాలు కూడా ఘోర హత్యలకు దారి తీస్తున్నాయి. పశ్చిమ ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలో చోటు చేసుకున్న అత్యంత దారుణమైన ఘటన ఇలాంటి ఆందోళననే రేకిస్తోంది. కాస్తంత ఛోలే కూర అడిగినందుకు విచక్షణ మరిచి ఛోలే భటూరే విక్రయించే వ్యక్తి 35 ఏళ్ల డ్రైవర్‌ను దారుణంగా పొడిచి చంపేశాడు. ఎం జరిగిందంటే..
నిహాల్ విహార్‌లోని రౌ విహార్ నివాసి అయిన సందీప్ (35)వృత్తిరీత్యా డ్రైవర్. ఛింటూ గుప్తా ఛోలే భటూరే విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రోజున జ్వాలాపురి నాలా వద్ద ఏర్పాటు చేసిన వారపు సంతకు సందీప్ ఏదైనా తిందామని వెళ్లాడు సందీప్. అక్కడ ఛోలే భటూరే తింటూ, వ్యాపారిని మరికొంత ఛోలే కూడా అడిగాడు. అంతే వ్యాపారికి కోపం వచ్చింది. అతను దుర్భాషలాడటంతో ఇద్దరి ఇద్దరి మధ్య వాగ్వాదం, ఘర్షణగా మారింది. దీంతో సందీప్‌ను ఒక్కడ్ని చేసి వ్యాపారితో పాటు మరో 4-5 మంది కలిసి ఆయనపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు.
సందీప్ తండ్రి బిజేందర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, సందీప్ పొత్తికడుపులో ఎడమ వైపున మూడు తీవ్రమైన కత్తిపోట్లు, ఎడమ ముంజేయి , మణికట్టుపై లోతైన గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సందీప్‌ను మొదట సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి, ఆ తర్వాత పంజాబీ బాఘ్‌లోని మహారాజా అగ్రసేన్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సందీప్ మంగళవారం సాయంత్రం కన్నుమూశాడు.
ఇదీ చదవండి: రూ. కోటిన్నర జీతం వదిలేసిన టెకీ జంట, ఎందుకో తెలుసా?
ప్రాథమిక విచారణ అనంతరం పశ్చిమ్ విహార్ వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు ఛింటూ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఘటన సమయంలో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులను పోలీసులు విచారిస్తున్నారు. దాడిలో పాల్గొన్న ఇతర వ్యక్తుల పాత్రపై కూడా తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: నెక్ట్స్ లెవల్ : దోసె, ఫిల్టర్ కాఫీకి జర్మన్ యువకుడు ఫిదా!


