ఢిల్లీలోని తన నివాసంలో విపక్ష కూటమి నేతలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన తేనీటి విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో సుప్రియా సూలే, సంజయ్‌రౌత్, ఎంఏ బేబీ, ప్రియాంకాగాం«దీ, తేజస్వీయాదవ్ తదితరులు
తొలగించిన ఓటర్లను గుర్తించి.. తిరిగి చేర్పించే బాధ్యత తీసుకోండి
అర్హులైన ప్రతీ ఒక్కరి ఓటును రక్షించే బాధ్యత పీసీసీ, ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలదే
సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పష్టం చేసిన రాహుల్, ఖర్గే
జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టీకరణ
ఏఐసీసీ చేసే ప్రతీ పోరాటానికి మద్దతుగా ఉంటామన్న రాష్ట్ర నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తయ్యే వరకు పూర్తి అప్రమత్తతతో ఉండాల్సిందేనని కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర నేతలకు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్లో పేర్లు గల్లంతైనట్లు పేర్కొంటున్న ఓటర్లను గుర్తించి, వారి పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేరి్పంచేందుకు పోలింగ్ బూత్ స్థాయిలో ప్రత్యేక కార్యకర్తలను నియమించాలని ఆదేశించింది.
రాష్ట్రంలోని ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి చేస్తున్న ఓట్ల చోరీని అడ్డుకోవాలని చెప్పింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘ఇండియా’కూటమి హస్తినలో చేపట్టిన ‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితోపాటు ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాం«దీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్, ఖర్గే సర్ అంశంలో క్షేత్రస్థాయిలో కొట్లాడాల్సిన అవసరాన్ని మరోమారు నొక్కిచెప్పినట్లు తెలిసింది.
లేదంటే గెలుపోటములు ప్రభావితం
ఓటరు సవరణ ప్రక్రియలో పారదర్శకతకు తూట్లు పొడిచి, ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓటర్లు, ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఈసీ ఓట్లను తొలగిస్తోందని రాహుల్ పేర్కొన్నట్లు సమాచారం. తమ అర్హతను తామే నిరూపించుకోవాల్సిన భారాన్ని పౌరులపై మోపుతూ, హడావుడిగా కొనసాగుతున్న సర్ ప్రక్రియను తేలిగ్గా తీసుకోరాదని చెప్పినట్లు తెలిసింది. ఒక్కో బూత్‌లో 2–3శాతం ఓట్లే పోయాయని తేలిగ్గా తీసుకోరాదని, వీటిద్వారా గెలుపోటములు ప్రభావితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాహుల్ చెప్పినట్లు నేతలు పేర్కొన్నారు.
యువత నిలదీసి ప్రశి్నస్తుందనే భయంతోనే మోదీ ప్రభుత్వం నిశ్శబ్దంగా ఫారం–6 నిబంధనల్లో అక్రమ మార్పులు చేసి, యువతను ఓటు హక్కుకు దూరం చేస్తోందన్న రాహుల్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సర్‌పై అవగాహన కల్పించేలా వివిధ ప్రాంతాల్లో సమావేశాలు, పాదయాత్రలు నిర్వహించాలని ఖర్గే సూచించినట్లు తెలిసింది. బూత్‌ల వారీగా తొలగించిన ఓట్లను తిరిగి చేర్చేలా ఎమ్మెల్యే, మంత్రులు బాధ్యత తీసుకోవాలని, పీసీసీ దీనిని పర్యవేక్షించాలని సూచించినట్లు తెలిసింది. జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించే వరకు ఈ పోరాటం ఆగదని.. దీనిపై అన్ని వేదికల మీద పోరాటం కొనసాగుతూ ఉంటుందని రాహుల్, ఖర్గే స్పష్టం చేసినట్లు సమాచారం.
రాష్ట్ర నేతల సంఘీభావం
సర్ అక్రమాలపై గళమెత్తి పోరాటం చేస్తున్న ఏఐసీసీ నేతలు, ఇండియా కూటమి పక్షాలకు రాష్ట్ర నేతలంతా సంఘీభావం ప్రకటించారు. దేశంలో నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం అధికారంలోని బీజేపీ కుమ్మక్కైన విధానాన్ని దేశమంతా గమనిస్తోందని, ఈ అంశంలో రాహుల్ సహా కాంగ్రెస్ చేస్తున్న పోరాటంపై హర్షం వ్యక్తమవుతోందని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
జాతీయ స్థాయిలో పార్టీ చేసే ప్రతీ పోరాటానికి రాష్ట్ర నేతలంతా మద్దతుగా ఉంటారని రేవంత్ హామీ ఇచ్చినట్లు వెల్లడించాయి. రాష్ట్ర స్థాయి నుంచి బూత్‌స్థాయి వరకు సర్ఫై పోరాటం కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు. కాగా, ఇండియా కూటమి పక్షాలకు రాహుల్ ఇచ్చిన తేనీటి విందుకు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్జేడీ, ఎస్పీ, తృణముల్, కమ్యూనిస్టు పక్షాల నేతలతో ఆయన ముచ్చటించారు.


