వైకల్యాన్ని బట్టి పరిహారమా? | SC treats mason leg amputation as 100 pc functional disability | Sakshi
Sakshi News home page

వైకల్యాన్ని బట్టి పరిహారమా?

Jun 25 2026 1:44 AM | Updated on Jun 25 2026 1:44 AM

SC treats mason leg amputation as 100 pc functional disability

బాధితుడి ఉపాధి, జీవనాధారంపై చూపే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి  

సుప్రీంకోర్టు ధర్మాసనం స్పషీ్టకరణ  

తమిళనాడుకు చెందిన బాధితుడి పరిహారం రూ. 40.29 లక్షలకు పెంపు  

సాక్షి, న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి, శాశ్వత అంగవైకల్యం బారినపడే బాధితులకు పరిహారం చెల్లించే విధానంపై సుప్రీంకోర్టు అత్యంత కీలక తీర్పు వెలువరించింది. ప్రమాదాల్లో శరీర భాగాలను కోల్పోవడం వల్ల వైద్యపరంగా నిర్ధారించే భౌతిక వైకల్యం శాతాన్ని బట్టి మాత్రమే పరిహారాన్ని నిర్ణయించకూడదని స్పష్టం చేసింది. బాధితుడి ఉపాధి, సంపాదనపై చూపే ప్రభావం ఆధారంగానే పరిహారాన్ని సమగ్రంగా లెక్కించాలని తేల్చిచెప్పింది. 

రోడ్డు ప్రమాదంలో కుడి కాలును మోకాలి పైవరకు కోల్పోయిన ఓ తాపీ మేస్త్రీ వైకల్యాన్ని 100 శాతంగా పరిగణించాల్సిందేనని పేర్కొంది. వైకల్యాన్ని కేవలం 70 శాతంగా కిందికోర్టులు నిర్ధారించడాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బాధితుడికి చెల్లించాల్సిన పరిహారాన్ని రూ.29.01 లక్షల నుంచి రూ.40.29 లక్షలకు పెంచుతూ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎన్‌.వి.అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.  

అసలేం జరిగిందంటే.. 
తమిళనాడులో నామక్కల్‌–సేలం జాతీయ రహదారిపై 2017 ఏప్రిల్‌ 18న ఎం.పరమేశ్‌ (30) అనే తాపీ మేస్త్రీ సైకిల్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో పరమేశ్‌ కంటికి, దవడకు బలమైన గాయాలు కావడంతోపాటు కుడి కాలును మోకాలి పైవరకు తొలగించాల్సి వచ్చింది. తాపీ మేస్త్రీగా పనిచేస్తూ నెలకు రూ.20 వేలు సంపాదిస్తున్నానని, తన కాలు కోల్పోవడంతో జీవనాధారం పూర్తిగా పోయిందని బాధితుడు మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్‌ ట్రిబ్యునల్‌ను(ఎంఏసీటీ) ఆశ్రయించాడు. తగిన పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. 

కింది కోర్టుల లెక్కింపు ఇలా..  
విచారణ చేపట్టిన ట్రిబ్యునల్‌.. బాధితుడి నెలవారీ ఆదాయాన్ని కేవలం రూ.6 వేలుగా పరిగణనలోకి తీసుకుంది. వైద్యులు ధ్రువీకరించిన విధంగా భౌతిక వైకల్యాన్ని 70 శాతంగా లెక్కించింది. అతడికి రూ.10.84 లక్షల పరిహారాన్ని 7.5 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ బాధితుడు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించాడు. వైకల్యాన్ని 70 శాతంగానే పరిగణించిన మద్రాస్‌ హైకోర్టు పరిహారాన్ని సుమారు రూ.29.01 లక్షలకు పెంచింది. భౌతిక వైకల్యాన్ని ప్రామాణికంగా తీసుకొని పరిహారం లెక్కించడాన్ని తప్పుబడుతూ బాధితుడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు.  

లెక్కింపు సవరణ.. పెరిగిన పరిహారం  
బాధితుడి వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు పరిహారాన్ని స్వయంగా తిరిగి లెక్కించింది. బాధితుడి నెలవారీ ఆదాయాన్ని రూ.12 వేలుగా నిర్ధారించి, దానికి 40 శాతం భవిష్యత్‌ ప్రయోజనాలను జోడించింది. వైకల్యాన్ని 100 శాతంగా లెక్కకట్టింది. బాధితుడు జీవితాంతం కృత్రిమ కాలును ఉపయోగించాల్సి ఉంటుందని, కాలానుగుణంగా దాని నిర్వహణ, మారి్పడికి అయ్యే వైద్య ఖర్చులను రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచింది. మొత్తంగా బాధితుడికి అందాల్సిన పరిహారాన్ని రూ.40,29,730గా ఖరారు చేసింది. ఈ మొత్తంపై ఏటా 7.5 శాతం వడ్డీ చెల్లించాలని తెలిపింది. సవరించిన ఈ పరిహారాన్ని ఆరు వారాల్లోగా జమ చేయాలని బీమా సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవిక పరిస్థితుల ఆధారంగా బాధితులకు పరిహారం అందేలా చూడాలని ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు కింది కోర్టులకు స్పష్టమైన సూచనలు అందించింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement