పెళ్లికి నిరాకరిస్తే.. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదు | SC says refusal to marry alone doesnot amount to abetment of suicide | Sakshi
Sakshi News home page

పెళ్లికి నిరాకరిస్తే.. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదు

Oct 9 2026 5:21 AM | Updated on Oct 9 2026 5:21 AM

SC says refusal to marry alone doesnot amount to abetment of suicide

సహజీవన భాగస్వామి సూసైడ్‌ కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ 

తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు పక్కకు.. ఆరుగురు నిందితులపై కేసుల కొట్టివేత

సాక్షి, న్యూఢిల్లీ: సహజీవనం చేసిన భాగస్వామిని వివాహం చేసుకోవడానికి నిరాకరించడాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రేమ వైఫల్యం, బ్రేకప్‌ వంటివి ఆత్మహత్యకు దారితీసినంత మాత్రాన అన్నివేళలా దాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరంగా చెప్పలేమని తేల్చిచెప్పింది. ఆత్మహత్య చేసుకొనేలా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం లేదా పెళ్లికి నిరాకరిస్తే ఆత్మహత్య చేసుకుంటారన్న విషయం ముందే తెలిసి ఉండటం లాంటివి లేనప్పుడు సెక్షన్‌ 306 కింద కేసు నమోదు చేయడం చెల్లదని పేర్కొంది. తెలంగాణలో 2022లో నమోదైన ఆత్మహత్య కేసులో దాఖలైన అప్పీల్‌పై జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ కె. వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 

చిన్ననాటి స్నేహితురాలితో మూడు నెలలపాటు సహజీవనం చేసిన ఓ యువకుడు తొలుత ఆమెతో పెళ్లికి సిద్ధపడ్డాడు. అయితే అతని స్నేహితుడు యువతి గురించి చెడుగా మాట్లాడటం, అదే సమయంలో యువకుడి సోదరి కాబోయే భర్త ఈ వివాహాన్ని వ్యతిరేకించడంతోపాటు తల్లిదండ్రులు సైతం యువతితో సంబంధాన్ని తెంచుకోవాలని ఒత్తిడి తెచ్చారు. అయితే యువతి మాత్రం తనను సహజీవన భాగస్వామి పెళ్లి చేసుకోకుంటే ప్రాణాలు తీసుకుంటానని సోదరికి ఫోన్లో చెప్పి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. 

ఈ ఘటనలో మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకుడితోపాటు అతని తల్లిదండ్రులు, సోదరి, స్నేహితుడు, సోదరికి కాబోయే భర్త.. మొత్తం ఆరుగురిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సెషన్స్‌ కోర్టుతోపాటు హైకోర్టు నిందితులను దోషులుగా తేల్చగా ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఆరుగురిపై ఉన్న ప్రొసీడింగ్స్‌ను కొట్టేసింది. నిందితులు కస్టడీలో ఉంటే తక్షణమే విడుదల చేయాలంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement