సాక్షి, ఢిల్లీ: అవినీతి చట్టంలోని 'సెక్షన్ 17A' రాజ్యాంగ బద్ధతపై ఎటూ తేలలేదు. ఈ సెక్షన్ చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం వేర్వేరు తీర్పులు ఇచ్చింది.
జస్టిస్ విశ్వనాథన్ ఈ సెక్షన్‌ను సమర్థించగా, జస్టిస్ నాగరత్న దీనిని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కొట్టిపారేశారు. ఇద్దరు న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. ఈ అంశాన్ని తగిన బెంచ్‌కు(స్పెషల్) బదిలీ చేసేందుకు భారత ప్రధాన న్యాయమూర్తికి నివేదించారు.
ఆత్మాభిమానం గల వ్యక్తికి అపఖ్యాతి కంటే మరణమే మేలు. నేటి సాంకేతిక, సోషల్ మీడియా యుగంలో ఒకసారి పరువు పోతే, ఆ తర్వాత నిర్దోషిగా తేలినా ప్రయోజనం ఉండదు. అధికారులను వేధించకుండా ఉండేందుకు ఈ నిబంధన అవసరం. సెక్షన్ 17ఎ రాజ్యాంగబద్దమే. అయితే లోక్ పాల్ లేదంటే లోకాయుక్త అనుమతి ఉండాలి
::జస్టిస్ విశ్వనాథన్
సెక్షన్ 17A అవినీతికి పాల్పడే అధికారులకు రక్షణ కల్పిస్తోంది. అవినీతికి పాల్పడే వారికి ఎలాంటి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. విచారణకు ముందస్తు అనుమతి అక్కర్లేదు
::జస్టిస్ నాగరత్న
సెక్షన్ 17 ఏ చెల్లుబాటును సవాల్ చేస్తూ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్.. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ సెక్షన్ గురించి గతంలోనూ విచారణ జరిగింది. అంతెందుకు స్కిల్‌స్కాం కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు జరిపే అంశంలో ఈ సెక్షన్ కీలకంగా నిలిచిన సంగతి గుర్తుండే ఉంటుంది.
17A-చట్టం పూర్వాపరాలు…
2018 లో అవినీతి నిరోధక యాక్టులో సవరణ చేస్తూ 17-A అనే కొత్త సెక్షన్‌ను చేర్చింది. నిజాయితీ పరులైన ప్రభుత్వ ఉద్యోగులకు కక్ష సాధింపు నుంచి తప్పించేందుకు చట్టం తీసుకువచ్చినట్లు ప్రకటించింది. అయితే..17A అనేది పూర్తిగా 2018 తరువాత కేసులకే వర్తిస్తుందని పార్లమెంటు స్పష్టం చేసంది. ఈ చట్టం ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు… ఉద్యోగ బాధ్యతలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి నేరాల్లో ముందస్తు అనుమతి లేకుండా ఏ పోలీసు అధికారి సైతం విచారణ చేయడానికి వీలు లేదు.
a) నేరము జరిగిన సమయములో సదరు వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలి
(b) నేరము జరిగిన సమయములో సదరు వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలి.
(c) నేరము జరిగిన సమయంలో సదరు ఉద్యోగిని పదవి నుంచి తొలగించగల అధికారం ఉన్నవారి అనుమతి తర్వాతనే విచారణ ప్రారంభించాలి అయితే..
►ఏసీబీ ట్రాప్‌తో పాటు సంఘటన స్థలంలోనే నేరం చేసిన ఉద్యోగిని అరెస్టు చేసిన సందర్భాలలో ఎలాంటి అనుమతి అవసరం లేదు. ►ప్రభుత్వ ఉద్యోగిపై విచారణ కోసం అనుమతి అడిగిన సమయంలో సదరు ఉన్నతాధికారి మూడు నెలల్లో తన నిర్ణయం వెల్లడించాలి. ఈ గడువు మరో నెలరోజులు పొడిగించే అవకాశం ఉంది.
చంద్రబాబు కేసులో జరిగింది ఇదే..
స్కిల్ కేసులో నాడు(సెప్టెంబర్ 9, 2023) తనను గవర్నరు అనుమతి లేకుండా తనను అరెస్టు చేశారు గనుక అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ద్వారా రక్షణ కావాలని.. మొత్తం కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌ను వేశారు. కాకపోతే స్కిల్ కుంభకోణం 2018కి ముందే జరగటం.. ఈ కేసులో పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఉండటం వల్ల సెక్షన్ 17ఏ వర్తించదని చంద్రబాబు కేసులో సీఐడీ వాదించింది కూడా. చంద్రబాబుపై సెక్షన్ 13 (సీ),(డీ) కింద అభియోగాలు మోపారని, వాటిని తర్వాత రద్దు చేసినప్పటికీ, రద్దుకు ముందే నేరం జరిగిందని సీనియర్ న్యాయవాది రోహత్గీ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ‘సెక్షన్ 17ఏ జూలై 2018లో అమలులోకి వచ్చింది. నేరం 2015–2016 మధ్య జరిగింది. ఆ సమయంలో చట్టంలో సెక్షన్ 17ఏ లేదు. చట్ట సవరణకు ముందు కేసు కాబట్టి 17ఏ వర్తించదు. అలాగే.. చంద్రబాబు కేసుకు 17ఏ వర్తించదని నాలుగు హైకోర్టు తీర్పులు ఇచ్చాయి’ అని సుప్రీం కోర్టుకు గుర్తు చేశారు. ఇదిలా ఉండగానే.. ఏపీ సీఐడీ ఈ కేసులో ఆధారాల్లేవని చెప్పడంతో.. ఏసీబీ కోర్టు తాజాగా ఈ కేసును కొట్టేసిన సంగతి తెలిసిందే.


