న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన వ్యవహారంలో అరెస్టయిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను కోర్టు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో తీహార్ జైలుకు తరలించారు. భద్రతా కారణాలు, విచారణ నిబంధనల దృష్ట్యా వీరిద్దరినీ ఒకే చోట కాకుండా వేర్వేరు జైళ్లలో ఉంచారు. సౌరవ్ దాస్‌ను జైలు నంబర్ 2లో ఉంచగా, అశుతోష్ రాంకాను తీహార్‌లోని జైలు నంబర్ 4లో ఉంచారు.
ఇటీవల నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించిన జంతర్ మంతర్ పరిసరాల్లో చట్టవిరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇచ్చిన హామీలను అతిక్రమించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని, రిపీట్ అఫెండర్లుగా భావిస్తూ వీరిపై బీన్ఎస్ఎస్ సెక్షన్ల కింద చర్యలు చేపట్టి జైలుకు పంపారు. ఇదే వ్యవహారంలో మరో సభ్యుడు అజింక్యా షిండేకు షరతులతో కూడిన బెయిల్ లభించగా, ఈ ఇద్దరు కీలక నేతలు మాత్రం తీహార్ జైలు పాలయ్యారు.
ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ వారి తరఫు న్యాయవాదులు పాటియాలా హౌస్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీరి నిర్బంధం, జైలుకు తరలించిన విధానంపై రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ మొదలైంది. వీరి బెయిల్ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం వెలువడే వరకు ఇద్దరూ తీహార్‌లోని నిర్దేశిత జైలు గదుల్లోనే న్యాయపరమైన కస్టడీలో ఉండనున్నారు.
ఇదీ చదవండి: పాత పేపర్లతో కలకత్తా కాళి.. తెగ ఆశ్చర్యపోతున్న భక్తులు!


