
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో అకాల విడుదలకు అనుమతి పొందిన ఏడుగురు జీవిత ఖైదీలలో ఒకరైన సంతాన్(55) నేడు (బుధవారం) చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కన్నుమూశాడు. సంతాన్ అలియాస్ సుతేంతిరరాజా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జనవరిలో ఆసుపత్రిలో చేరాడు.
క్రిప్టోజెనిక్ సిర్రోసిస్‌తో బాధపడుతున్న సంతాన్.. రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని హెపటాలజీ (లివర్) ఐసీయూ విభాగంలొ చికిత్స పొందుతున్నాడు. అతనికి సోకిన కాలేయ వ్యాధి కారణంగా ఊపిరి ఆడకపోవడం, పొత్తికడుపులో ద్రవం ఏర్పడటం, అవయవాలు వాపు మొదలైన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. సంతాన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని హాస్పిటల్ డీన్ డాక్టర్ ఇ థెరానీరాజన్ ఇటీవల మీడియాకు తెలిపారు.
2022, నవంబరు 11న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సంతాన్‌కి విధించిన మరణశిక్ష యావజ్జీవ కారాగార శిక్షగా మారింది. సంతాన్‌తో పాటు మరో ఐదుగురు దోషులైన నళినీ శ్రీహరన్, శ్రీహరన్, రాబర్ట్ పాయస్, జయకుమార్, రవిచంద్రన్‌లు 32 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపిన తర్వాత వివిధ జైళ్ల నుండి విడుదలయ్యారు.