
చెన్నై: తమిళనాట రూపాయి చిహ్నం మార్పు రగడపై.. ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ ఎట్టకేలకు స్పందించారు. రాష్ట్ర బడ్జెట్ ప్రతుల్లో ఈయన రూపొందించిన రూపాయి గుర్తును తొలగించి.. ఆ స్థానంలో రూ. అనే అర్థం వచ్చేలా తమిళ పదం డీఎంకే ప్రభుత్వం చేర్చిన సంగతి తెలిసిందే. భాషా యుద్ధానికి మరింత ఆజ్యం పోస్తూ బీజేపీ వర్సెస్ కేంద్రంగా పరస్పర విమర్శలతో సాగుతోందీ వ్యవహారం. అయితే ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తానేం తప్పుబట్టబోనని ఉదయ్ కుమార్ అంటున్నారు.
మేం రూపొందించే అన్ని డిజైన్‌లకు పేరొస్తుందన్న గ్యారెంటీ లేదు. అలాగే.. అందరు వాటిని మెచ్చుకోవాలనీ లేదు. ప్రతీ ఒక్కరూ తమ పనిలో విమర్శలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఆ విమర్శలను సానుకూలంగా తీసుకుని.. ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకు సాగాలి. నాది అదే ధోరణి. అంతమాత్రాన ఇదేదో నన్ను, నా పనిని అవమానించడం అని నేను అనుకోను. రూపాయి సింబల్‌ను రూపొందించడాన్ని గర్వంగా భావిస్తున్నానన్న ఆయన.. డీఎంకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తానేం వ్యతిరేకించబోనని స్పష్టం చేశారు. చిహ్నం మార్పునకు ప్రభుత్వానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు.. అవేం నన్ను అసంతృప్తికి గురి చేయలేదు ఆయన వ్యాఖ్యానించారు.
నాడు నేను నాకు అప్పగించిన పని గురించి మాత్రమే ఆలోచించా. సాధారణంగా.. అర్థవంతంగా ఉండే ఒక చిహ్నం రూపొందించాలని ఒకింత ఆందోళనగానే పని చేశా. ఆ చాలెంజ్‌లో విజయం సాధించా. అంతేకానీ, వివాదంగా మారాలని.. మారుతుందనిగానీ అనుకోలేదు అని ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారాయన.
ఇదిలా ఉంటే.. 2009లో అప్పటి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ రూపాయికి ఓ గుర్తును సూచించాలని బహిరంగంగా పోటీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా 3,331 డిజైన్లలో ఐదు షార్ట్ లిస్ట్ చేశారు. అందులో ప్రొఫెసర్ ఉదయ్ పంపిన గుర్తు ఫైనలైజ్ అయ్యింది. ఇది దేవనాగరి లిపి र, 'ra', లాటిన్‌లో ఇంగ్లీష్‌లో నిలువు గీత లేని Rను పోలి ఉంటుంది. ₹లో రెండు సమాన అడ్డగీతలు అసమానతల్లేని సంపద పంపిణీని సూచిస్తాయి. అయితే..
ఓ తమిళ వ్యక్తి రూపొందించిన గుర్తునే మార్చేసి.. డీఎంకే ప్రభుత్వం దారుణంగా అవమానపరిచిందంటూ బీజేపీ మండిపడుతోంది. ఈ విమర్శల వేళ దాని రూపకర్తే ఆ చర్యను తేలికగా తీసుకోవడం గమనార్హం.
ఇదీ చదవండి: రూపాయి సింబల్ సృష్టికర్త మామూలోడు కాదండోయ్!
Comments
Please login to add a commentAdd a comment