నేషనలిస్ట్‌ సిటిజెన్స్‌ పార్టీలో టీఎంసీ రెబల్స్‌ విలీనం | Rebel Trinamool Congress MPs announce merger with Nationalist Citizen Party | Sakshi
Sakshi News home page

నేషనలిస్ట్‌ సిటిజెన్స్‌ పార్టీలో టీఎంసీ రెబల్స్‌ విలీనం

Jun 15 2026 2:09 AM | Updated on Jun 15 2026 2:09 AM

Rebel Trinamool Congress MPs announce merger with Nationalist Citizen Party

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖను అందజేస్తున్న టీఎంసీ రెబల్‌ ఎంపీలు సుదీప్‌ బందోపాధ్యాయ్, శతాబ్దిరాయ్, కకోలి ఘోష్, మాలారాయ్‌ తదితరులు

ఎన్‌డీఏకు మద్దతిస్తామని ప్రకటన 

టీఎంసీలో ముదురుతున్న సంక్షోభం 

తమదే అసలైన పార్టీగా గుర్తించాలంటూ స్పీకర్‌కు అభిషేక్‌ బెనర్జీ లేఖ

న్యూఢిల్లీ: మమతా బెనర్జీతో విభేదించి వేరు కుంపటి పెట్టుకున్న తృణమూల్‌కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎంపీలు ఆదివారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎవరికీ పెద్దగా తెలియని నేషనలిస్ట్‌ సిటిజెన్స్‌ పార్టీ(ఎన్‌సీపీ)తో తమ చీలిక వర్గాన్ని విలీనం చేయబోతున్నట్లు టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు ఢిల్లీలో ప్రకటించారు. తమ నిర్ణయాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ముందుంచారు. ఇందుకోసం స్పీకర్‌ను ఆయన అధికార నివాసంలో కలిశారు. ఎన్‌డీఏకు మద్దతు పలుకుతున్న ఎన్‌సీపీలో తాము విలీనమవ్వాలని నిర్ణయించుకున్నట్లు లిఖితపూర్వకంగా తెలియజేశారు.

చీలిక వర్గంగా కొనసాగితే తలెత్తే చట్టపర సమస్యల నుంచి తప్పించుకునేందుకే తిరుగుబాటు ఎంపీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కీలక నేత, కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ సూచన మేరకే రెబల్‌ ఎంపీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేషనలిస్ట్‌ సిటిజెన్స్‌ పార్టీలో విలీనం అంశంపై తిరుగుబాటు ఎంపీల నాయకురాలు కకోలీ ఘోష్‌ దస్తీదార్‌ ఆదివారం మీడియాతో ఢిల్లీలో మాట్లాడారు. ‘‘టీఎంసీ ఎంపీల్లో మేం మూడింట రెండొంతుల మంది ఉన్నాం. అందరం స్పీకర్‌ను కలిశాం. లోక్‌సభలో విడిగా సీటింగ్‌ కేటాయించాలని కోరాం.

మేం త్వరలోనే నేషనలిస్ట్‌ సిటిజెన్స్‌ పార్టీలో విలీనం కాబోతున్నాం. ఎన్‌డీఏకు మద్దతిస్తాం’’అని ఆమె అన్నా రు. ‘‘మేం ఇప్పటికే విలీనమయ్యాం. ఎన్‌సీపీ అనేది ప్రాంతీయ పార్టీ. అసలైన టీఎంసీ ఏదనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. టీఎంసీ గుర్తు అయిన 2 పుష్పాలను మేమే దక్కించుకోబోతున్నాం’’అని తిరుగుబాటు ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ్‌ వ్యాఖ్యానించారు. ఎన్‌సీపీ అనేది త్రిపురలో గుర్తింపులేని, రిజిస్టర్డ్‌ చిన్న రాజకీయ పార్టీ. 

స్పీకర్‌కు అభిషేక్‌ బెనర్జీ లేఖ.. 
చీలిక వర్గం వేరుగా ఉండబోమని నిర్ణయించిన నేపథ్యంలో టీఎంసీ ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ ఆదివారం లోక్‌సభ స్పీకర్‌కు ఒక లేఖ రాశారు. ‘‘టీఎంసీలో మరే ఇతర చీలిక వర్గాలు లేవు. పార్టీలో ఉన్నది ఒక్కటే ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్గం. పార్లమెంట్‌లో అదే అసలైన టీఎంసీ పార్టీ’’అని ప్రకటించండి అంటూ స్పీకర్‌కు రాసిన లేఖను పార్టీ ఎంపీలు కీర్తి ఆజాద్, సాగరికా ఘోష్‌లు బిర్లాకు ఆదివారం అందజేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది ఈ చీలికలను ఒప్పుకోదు అని ఎంపీలు స్పీకర్‌ ఎదుట తమ వాదన విని్పంచారు. 

మాదే అసలైన టీఎంసీ 
రెబల్‌ ఎంపీలు తమదే అసలైన టీఎంసీ అనే పునరుద్ఘాటించారు. ‘‘సోమవారం స్పీకర్‌ను కలవబోతున్నాం. సంఖ్యాపరంగా మెజార్టీతో ఉన్న కారణంగా తమ వర్గాన్నే అసలైన పార్టీగా ప్రకటించాలని బిర్లాను కోరబోతున్నాం. టీఎంసీ పార్లమెంటరీ వర్గంగా మమ్మల్నే ప్రకటించాలని బిర్లాను అభ్యరి్థస్తాం’’అని తిరుగుబాటు ఎంపీ జగదీశ్‌ చంద్ర బర్మ ఆదివారం వెల్లడించారు. దీనిపై మమత వర్గంలోని టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్‌ స్పందించారు.

‘‘వేర్పాటు కూటమికి చట్టంలో ఎలాంటి రక్షణ లేదు. అసలైన పార్టీ పదో షెడ్యూల్‌ ప్రకారం మరో పార్టీలో విలీనమైతే తప్ప ఇలాంటి తిరుగుబాటుదారులకు రక్షణ ఉండదు. ఒకే పార్టీలో రెండు వర్గాలు ఒకే ఎన్నికల గుర్తుపై కొనసాగడం కుదరదు’’అని ఘోష్‌ స్పష్టంచేశారు. సాగరికా వ్యాఖ్యలపై దస్తీదార్‌ స్పందించారు. ‘‘మేం 20 మంది ఉన్నాం. సోమవారం మరో ఇద్దరు జతకూడుతున్నారు. దాంతో మా రెబల్స్‌ బలం 22కు పెరుగుతుంది’’అని దస్తీదార్‌ అన్నారు. 

పార్టీ పదవుల్లోకి కొత్త ముఖాలు 
నమ్మిన బంటు సుదీప్‌ బంధోపాధ్యాయ్‌ వంటి సీనియర్‌ నేతలు సైతం తిరుగుబాటు శిబిరంలో చేరడంతో పార్టీలో వ్యవస్థాగత మార్పులకు మమత శ్రీకారం చుట్టారు. తృణమూల్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతల నుంచి సయోని ఘోష్‌ను తప్పించి బదులుగా అర్నాబ్‌ బెనర్జీని నియమించారు. నార్త్‌ కోల్‌కతా ఆర్గనైజేషన్‌ జిల్లాకు సుదీప్‌ను పక్కనబెట్టి కునాల్‌ ఘోష్‌ను నియమించారు. లోక్‌సభ విభాగంలో ప్రధాన సలహాదారు పదవికి ఎంపీ సౌగతా రాయ్‌ను ఎంపికచేశారు. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కాళీగంజ్‌ ఎమ్మెల్యే ఆలిపా అహ్మద్‌ను నియమించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement