విరాళాల వివాదం: కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ గృహ నిర్బంధం | Ram Mandir Donation Row Congress Leader Ajay Rai Under House Arrest in Ayodhya | Sakshi
Sakshi News home page

విరాళాల వివాదం: కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ గృహ నిర్బంధం

Jun 30 2026 9:54 AM | Updated on Jun 30 2026 10:40 AM

Ram Mandir Donation Row Congress Leader Ajay Rai Under House Arrest in Ayodhya

అయోధ్య: అయోధ్య రామ మందిర విరాళాల వ్యవహారంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్‌ను పోలీసులు ఆయన బస చేసిన హోటల్‌లో గృహ నిర్బంధం చేశారు. రామాలయంలో పూజలు చేసేందుకు ఎంపీలు, ఇతర సీనియర్ నేతలతో కూడిన కాంగ్రెస్ ప్రతినిధుల బృందం అయోధ్య సందర్శనకు సిద్ధమైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ పర్యటన గురించి స్థానిక యంత్రాంగానికి ముందే సమాచారం ఇచ్చినప్పటికీ, విరాళాల వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతున్నందున ఆయనను అడ్డుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
 

విరాళాల లెక్కింపు సమయంలో నగదును పక్కదారి పట్టించారనే ఆరోపణలపై అరెస్టయిన ఎనిమిది మంది నిందితుల తరపున వాదించకూడదని అయోధ్యలోని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా న్యాయవాది ఈ నిబంధన ఉల్లంఘిస్తే రూ. 5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తూ, ఆలయ నిర్వహణతో సంబంధం ఉన్న చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావులను వెంటనే అయోధ్య నుంచి పంపించేయాలని, లేకపోతే నగరంలోకి ఎవరినీ రాకుండా దిగ్బంధిస్తామని బార్ అసోసియేషన్ తీర్మానించింది.

మరోవైపు, ఈ విరాళాల అవకతవకలపై సీబీఐ ఆధ్వర్యంలోని ‘సిట్’తో సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, దీనిపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేస్తూ, వేసవి సెలవుల అనంతరం విచారిస్తామని వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, విరాళాల లెక్కింపు సిబ్బందిపై అనుమానంతో మూడు నెలల క్రితమే వారిని మార్చాలని ఎస్‌బీఐ  సూచించినా, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పట్టించుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement