రాజ్‌కోట్‌లో పెను విషాదం | Sakshi
Sakshi News home page

రాజ్‌కోట్‌లో పెను విషాదం

Published Sun, May 26 2024 5:35 AM

Rajkot gaming zone fire accident, 27 killed

టీఆర్‌పీ గేమ్‌ జోన్‌లో  భారీ అగ్ని ప్రమాదం

నలుగురు చిన్నారులు సహా 27 మంది మృతి

రాజ్‌కోట్‌: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవులు, వారాంతం కూడా కావడంతో సరదాగా ఆడుకునేందుకు వెళ్లిన నలుగురు చిన్నారులు సహా మొత్తం 27 మంది అగ్ని ప్రమాదానికి బలయ్యారు. నానా–మవా రోడ్డులోని టీఆర్‌పీ గేమ్‌ జోన్‌లో సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. 

అందరూ ఆటల్లో మునిగి ఉన్న వేళ ఆ ప్రాంతాన్ని ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. దీంతో, అందులో చిక్కుకుపోయిన వారంతా హాహాకారాలు చేశారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని దాదాపు ఐదుగంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంతోపాటు బలమైన గాలులు వీస్తున్న కారణంగా ఫైబర్‌ డోమ్‌ పూర్తిగా కుప్పకూలింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. 

శిథిలాలను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నట్లు రాజ్‌కోట్‌ కలెక్టర్‌ ప్రభావ్‌ జోషి చెప్పారు. ఇప్పటి వరకు 27 మృతదేహాలను వెలికితీశామన్నారు. పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయన్నారు. మృతదేహాలను, క్షతగా త్రులను వెంటనే ఆస్పత్రులకు తరలించామ ని చెప్పారు. ఘటన నేపథ్యంలో నగర వ్యాప్తంగా ఉన్న గేమింగ్‌ జోన్లు అన్నిటినీ వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. 

ప్రమాదం సంభవించిన గేమ్‌ జోన్‌లో తక్షణమే సహాయ కార్యక్రమాలను చేపట్టాలని యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సీఎం భపేంద్ర పటేల్‌ తెలిపారు. ఘటనకు దారి తీసిన కారణాలపై సిట్‌తో ప్రత్యేక విచారణ చేయిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారంగా ప్రకటించారు. కాగా, రాజ్‌కోట్‌లో విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

యజమాని అరెస్ట్‌
టీఆర్‌పీ గేమ్‌ జోన్‌ యజమాని యువరాజ్‌ సింగ్‌ సోలంకీ, మేనేజర్‌తోపాటు మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement