
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఐఎస్‌ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) తరపున గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో అల్వార్‌లోని గోవింద్‌గఢ్ నివాసి మంగత్ సింగ్‌ను రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. రాజస్థాన్ పోలీసుల సీఐడీ ఇంటెలిజెన్స్ దర్యాప్తు అనంతరం మంగత్ సింగ్‌ను అధికారిక రహస్యాల చట్టం కింద అరెస్టు చేశారు.
సీఐడీ అధికారులు అల్వార్ కంటోన్మెంట్ ప్రాంతంలో నిఘా సారించినప్పుడు మంగత్ సింగ్ కార్యకలాపాలను గుర్తించారు. సింగ్ కొంతకాలంగా అనుమానాస్పద చర్యలకు పాల్పడుతున్నాడని అధికారులు గమనించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగ్ పాకిస్తాన్ నిఘా సంస్థకు చెందిన హ్యాండ్లర్లతో తరచూ సంప్రదింపులు జరుపుతున్నాడని దర్యాప్తులో తేలింది. ఇషా శర్మ అనే మారుపేరుతో పనిచేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన ఒక మహిళా హ్యాండ్లర్ సింగ్‌ను హనీ-ట్రాప్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గూఢచర్య కార్యకలాపాలలో సహకరించినందుకు ప్రతిగా ఆ హ్యాండ్లర్.. సింగ్‌కు ఆర్థికసాయం అందించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో సింగ్ భారతదేశ జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు అందజేసినట్లు తెలుస్తోంది.
సింగ్ గత రెండేళ్లుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్నాడని, గూఢచర్య కార్యకలాపాలలో అతని ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. మంగత్ సింగ్ అరెస్టు ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా జరిగింది. రాజస్థాన్ ఇంటెలిజెన్స్ ఈ ప్రాంతంలో నిఘా సారించింది. కంటోన్మెంట్ ప్రాంతంలో అనుమానాస్పద కార్యకలాపాలపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గూఢచర్యాన్ని అరికట్టేందుకు, భారతదేశ జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఈ అరెస్టు జరిగిందని పోలీసులు తెలిపారు.
గూఢచర్య కార్యకలాపాలలో పాల్గొన్నవారిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు అక్టోబర్ 10న జైసల్మేర్‌లో అనుమానిత గూఢచారి మహేంద్ర ప్రసాద్(32)ను అరెస్టు చేశారు. అతను డీఆర్‌డీఓ గెస్ట్‌హౌస్ మేనేజర్‌గా పనిచేస్తూ, సున్నితమైన రక్షణ సంబంధిత సమాచారాన్ని పాక్‌కు లీక్ చేశాడని తేలింది. 32 ఏళ్ల ప్రసాద్ పాకిస్తాన్ నిఘా నిర్వాహకునితో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదేవిధంగా జైసల్మేర్‌కు చెందిన హనీఫ్ ఖాన్‌ను ఐఎస్‌ఐ కార్యకర్తలకు రహస్య సైనిక సమాచారాన్ని చేరవేస్తున్నాడనే ఆరోపణలతో ఇటీవల అరెస్టు చేశారు.