రాహుల్ గాంధీ ‘మిస్సింగ్’ పోస్టర్ల కలకలం | Rahul Gandhi Missing Posters Surface in Delhi | Sakshi
Sakshi News home page

రాహుల్ గాంధీ ‘మిస్సింగ్’ పోస్టర్ల కలకలం

Jun 28 2026 1:41 PM | Updated on Jun 28 2026 1:45 PM

Rahul Gandhi Missing Posters Surface in Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ కలకలం రేగింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ‘కనిపించడం లేదు’ (మిస్సింగ్) అంటూ ఆదివారం ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాల్లో వెలిసిన పోస్టర్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ తాజా విదేశీ పర్యటనను లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్‌లో ఈ పరిణామం సరికొత్త మలుపు తిప్పింది.

అర్ధరాత్రి పోస్టర్ల కలకలం
ఢిల్లీలోని ఫిరోజ్‌షా రోడ్డుతో పాటు పలు ప్రధాన కూడళ్లలో రాహుల్ గాంధీ ఫోటోతో కూడిన ‘మిస్సింగ్’ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. అయితే, ఈ పోస్టర్లను ఎవరు అంటించారనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియరాలేదు. పార్లమెంట్ సమావేశాలు, కీలక ఎన్నికలు, లేదా పార్టీ అంతర్గత ప్రాముఖ్యత కలిగిన సమయాల్లో రాహుల్ గాంధీ దేశంలో ఉండరంటూ శనివారం నుంచే బీజేపీ తన విమర్శల పదును పెంచిన మరుసటి రోజే ఈ పోస్టర్లు కలకలం రేపడం గమనార్హం.

‘లీడర్ ఆఫ్ పర్యటన్’
ఈ అంశంపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ ఎంపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ లోక్‌సభ ప్రతిపక్ష నేత  పదవిని @లీడర్ ఆఫ్ పర్యటన్ (టూరిజం) అండ్ పార్టీయింగ్’గా మార్చేశారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ నడుస్తున్నప్పుడు లేదా దేశానికి, సొంత పార్టీకి ఆయన అవసరం ఉన్నప్పుడల్లా విదేశాలకు వెళ్లడం రాహుల్‌కు అలవాటుగా మారిందని, ప్రజల కంటే ఆయన టూరిజానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.

మోదీ వర్సెస్ రాహుల్
ఇదే క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరుతో రాహుల్ గాంధీని పూనావాలా పోల్చారు. పీఎం మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 9,000 రోజులకు పైగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజాసేవలో ఉన్నారని, కానీ రాహుల్ మాత్రం ఎప్పుడూ వెకేషన్ మూడ్‌లోనే ఉంటారని విమర్శించారు. రాహుల్ విదేశీ పర్యటనల ఖర్చుల వెనుక ఉన్న మూలాలను ప్రశ్నించిన ఆయన, దేశ వ్యతిరేక ఎజెండాను ప్రోత్సహించే శక్తులు దీని వెనుక ఉన్నాయంటూ ఆరోపించారు. కాగా, ఈ పోస్టర్లు, బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement