
ఈసీకి రాహుల్ గాంధీ హెచ్చరిక
కర్నాటకలో మోసం జరిగిందని ఆరోపణ
న్యూఢిల్లీ: గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కర్నాటకలోని ఓ నియోజకవర్గంలో మోసం జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తామనుకోవద్దు..మేం మిమ్మల్ని వదిలిపెట్టం అంటూ ఆయన చేసిన హెచ్చరికలపై ఎన్నికల కమిషన్(ఈసీ) తీవ్రంగా స్పందించింది. రాహుల్ గురువారం పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన..‘భారత ఎన్నికల సంఘం తన విధులను సక్రమంగా నిర్వహించడం లేదు. గతేడాది కర్నాటకలో లోక్‌సభ ఎన్నికలు జరిగిన ఒక్కో నియోజకవర్గాన్ని పరిశీలిస్తూ వస్తున్నాం. ఒక నియోజకవర్గంలో తప్పు జరిగినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. 90 శాతం కాదు..100శాతం మోసం జరిగినట్లు రుజువులున్నాయి. అక్కడంతా డ్రామా నడిచింది. దీనిపై ఈసీకి మెసేజీ పంపుతా.
ఈ విషయం ఇంతటితో ముగిసిందని ఈసీ, అధికారులు అనుకోవద్దు. మీరు తప్పు చేశారు. ఎక్కడికీ వెళ్లలేరు. మిమ్మల్ని వెంటాడుతాం’అని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది. ఎన్నికలైన ఏడాది తర్వాత రాజ్యాంగ సంస్థపై నిరాధార బెదిరింపు ఆరోపణలు చేయడం తగదని పేర్కొంది. ప్రజాప్రాతినిధ్యచట్టంలోని సెక్షన్ 80 ప్రకారం హైకోర్టులో పిటిషన్ వేయకుండా ఇటువంటి విమర్శలు చేయడం దురదృష్టకరమంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా నమోదవలేదని ఈసీ తెలిపింది.