
పార్లమెంట్‌లో ప్రమాణం చేశా.. మళ్లీ చేయాలా?
ఎలక్ట్రానిక్ ఓటర్ డేటా అందజేస్తే.. ప్రధాని పదవిని మోదీ చోరీ చేశారని నిరూపిస్తాం
రాజ్యాంగంపై దాడి చేస్తే.. మేము మీపై దాడి చేస్తాం
ఈసీ అధికారులకు రాహుల్ హెచ్చరిక
బెంగళూరులో ‘ఓటు అధికార్ ర్యాలీ’
బెంగళూరు: దేశంలో ముమ్మాటికీ ఓట్ల చౌర్యం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలపై తాను గణాంకాలు విడుదల చేసిన తర్వాత ప్రజలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. దాంతో దిక్కుతోచని ఎన్నికల సంఘం సంబంధిత వెబ్‌సైట్‌ను మూసివేసిందని అన్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహార్‌లో ఈసీ వెబ్‌సైట్లు మూతపడ్డాయని తెలిపారు.
ఎన్నికల బాగోతాలపై ప్రజలంతా నిలదీయడం ప్రారంభిస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఈసీకి బాగా తెలుసని వ్యాఖ్యానించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటు అధికార్ ర్యాలీ’లో రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని చేతబూని ప్రసంగించారు.
తాను చేసిన ఆరోపణలు నిజమని అంగీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని, ప్రమాణం చేయాలని ఎన్నికల సంఘం డిమాండ్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంట్‌లో భారత రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేశానని వ్యాఖ్యానించారు. మళ్లీ ఈసీ ఎదుట ప్రమాణం చేయాలా? అని మండిపడ్డారు. ఎన్నికల సంఘానికి రాహుల్ ఐదు ప్రశ్నలు సంధించారు. తనను బెదిరించడం పక్కనపెట్టి, వాటికి సమాధానం చెప్పాలని అన్నారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే...
కొత్త ఓట్లన్నీ బీజేపీకే...
‘‘మోదీ గత లోక్‌సభ ఎన్నికల్లో 25 స్థానాల్లో రిగ్గింగ్ చేసి మళ్లీ ప్రధాని అయ్యారు. దేశవ్యాప్తంగా ఎల్రక్టానిక్ ఓటర్ డేటా మాకు అందజేస్తే.. ప్రధానమంత్రి పదవిని మోదీ చోరీ చేశారని నిరూపిస్తాం. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మా కూటమి మెజార్టీ సీట్లు గెల్చుకుంది. కేవలం నాలుగు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకలా జరిగిందో ఆరా తీస్తే కోటి మంది కొత్త ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసినట్లు తేలింది. 4 నెలల్లోనే కోటి మంది ఎలా ఓటర్లయ్యారు? ఆ కొత్త ఓట్లన్నీ బీజేపీకే పడ్డా యి. భారీ సంఖ్యలో కొత్త ఓటర్లు నమోదైన చోట బీజేపీ గెలుస్తోంది. దీని వెనుక మతలబు ఏమిటి?
రాజ్యాంగంపై మోదీ దాడి
కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 16 సీట్లు వస్తాయని అంచనా వేశాం. సర్వేలు కూడా ఇదే విషయం చెప్పాయి. కానీ, 9 సీట్లే వచ్చాయి. అక్కడ ఏదో మాయ జరిగినట్లు తేలిపోయింది. ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీ ఇవ్వాలని కోరితే ఎన్నికల సంఘం ఇవ్వలేదు. వీడియో రికార్డింగ్‌లు ఇవ్వాలని అడిగితే తిరస్కరించారు. తర్వాత చట్టాన్ని మార్చేశారు. ఎన్నికలు పూర్తయ్యాక 45 రోజుల్లో వీడియో ఆధారాలను తొలగిస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పూర్తి డేటా ఇవ్వాలి. లేనిపక్షంలో మహాదేవపుర స్థానంలో నిర్వహించినట్లుగానే ఇతర నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిశోధన చేస్తాం.
ఎప్పటికైనా చర్యలు తథ్యం
ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికైనా నిజాలు అంగీకరించాలి. అసలేం జరిగిందో చెప్పాలి. వాస్తవాలకు ముసుగేయాలనుకోవడం సరైంది కాదు. ఏదో ఒకరోజు మీరు మమ్మల్ని(ప్రతిపక్షం) ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నికల కమిషనర్ సహా ప్రతి అధికారీ ఈ విషయం గుర్తించుకోవాలి. రాజ్యాంగంపై దాడి చేసి తప్పించుకుంటామంటే కుదరదు. మీపై చర్యలు తీసుకోవడానికి సమయం పట్టొచ్చు. కానీ, ఎప్పటికైనా చర్యలు మాత్రం తథ్యం. అక్రమార్కులు ఒకరి తర్వాత ఒకరు దొరికిపోవడం ఖాయం. నేను చెప్పేది రాసి పెట్టుకోండి. రాజ్యాంగంపై దాడికి దిగితే మేము మీపై దాడి చేస్తాం’’ అని రాహుల్ ధ్వజమెత్తారు.
ఈసీకి రాహుల్ 5 ప్రశ్నలు
1. ఓటర్ల జాబితాలను డిజిటల్ మెషీన్ రీడబుల్ ఫార్మాట్‌లో ప్రజలకు ఎన్నికల సంఘం ఎందుకు ఇవ్వడం లేదు?
2.ఎన్నికలకు సంబంధించిన వీడియో ఆధారాలను ఎందుకు ధ్వంసం చేశారు?
3.ఓటర్ల జాబితాల్లో గోల్‌మాల్ ఎందుకు జరిగింది?
4.మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్ప కుండా ఈసీ మమ్మల్ని ఎందుకు బెదిరిస్తోంది?
5.ఎన్నికల సంఘం అధికార బీజేపీకి ఏజెంట్‌గా ఎందుకు పనిచేస్తోంది?