ఢిల్లీలో ఓటేసిన వాళ్లే... బిహార్‌లోనూ వేశారు
బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేత రాహుల్ ఆరోపణలు
బంకా: ఓట్లనే కాదు, కాషాయ దళం ఏకంగా ఎన్నికలనే చోరీ చేస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల చోరీతోనే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారన్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో చేసినట్లే బీజేపీ చోరీ చేసిందని, గుజరాత్‌లో మళ్లీ మళ్లీ ఇదే జరుగుతోందన్నారు. ఈ విషయాన్ని జెన్ జెడ్‌కు, యువతకు ఆధారాలతో సహా కాంగ్రెస్ చూపిస్తుందని, ఇందులో సందేహమే లేదని తెలిపారు.
బీజేపీ నేతలే లక్ష్యంగా ఆయన మరోసారి ఓట్ చోరీ ఆరోపణలు చేశారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓటేసిన బీజేపీ నేతలు కొందరు, బిహార్ అసెంబ్లీ మొదటి విడత పోలింగ్‌లోనూ పాల్గొని ఓటేశారని విమర్శించారు. సంబంధించిన పేర్లు తదితర వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. బిహార్‌లోని బంకాలో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. హరియాణాలో చోటుచేసుకున్న ఓట్ చోరీపై కాంగ్రెస్ పార్టీ ఆధారాలను అందజేసినా ఎన్నికల కమిషన్ మాత్రం ఖండించలేదన్నారు. హరియాణా ప్రభుత్వం చోరీతో ఏర్పాటైన ప్రభుత్వమని ధీమాతో చెప్పగలనన్నారు.
గతేడాది జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందన్నారు. రాష్ట్ర ఓటరు జాబితాలోని 2 కోట్లకుగాను కనీసం 25 లక్షల నకిలీ పేర్లున్నాయని, బీజేపీని గెలిపించేందుకు ఎన్నికల కమిషన్ ఆ పారీ్టతో కుమ్మక్కయిందని విమర్శించారు. ఈసారి బిహార్‌లో అలా కానివ్వబోమన్నారు. ఇందుకు ప్రజలు అనుమతించరని తెలిపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఎన్డీయే ప్రభుత్వం యువతను సోషల్ మీడియాలో రీల్స్ చేసుకోవాలంటూ ప్రేరేపిస్తోందని రాహుల్ వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దపు వ్యసనమే రీల్స్ అన్నారు. బిహార్ రైతులకు బ్యాంకులు రుణాలి్వడం లేదు, రుణాలను మాఫీ చేయడం లేదని భాగల్పూర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ఆరోపించారు. కానీ, ఇష్టమైన కార్పొరేట్ సంస్థల రుణాలను మాత్రం రద్దు చేస్తోందన్నారు. బీజేపీ మీడియాను చెప్పుచేతల్లో పెట్టుకుందన్నారు. రోజులో 24గంటలూ ప్రధాని మోదీ మొహం చూపించేందుకు టీవీ చానెళ్లకు బీజేపీ భారీగా చెల్లింపులు చేస్తోందని పేర్కొన్నారు.


