రాహుల్‌ చేతిలో ‘స్టింగ్‌’.. పెప్సీకోకు కోర్టులో ఊరట | Rahul And Priyanka Gandhi Sting Moment Viral In Social Media | Sakshi
Sakshi News home page

రాహుల్‌ చేతిలో ‘స్టింగ్‌’.. పెప్సీకోకు కోర్టులో ఊరట

Oct 7 2026 11:48 AM | Updated on Oct 7 2026 11:54 AM

Rahul And Priyanka Gandhi Sting Moment Viral In Social Media

ఎస్‌ఐఆర్ (SIR), కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరసనలు చేపట్టింది. ఢిల్లీ సహా పలు చోట్ల నిరసనల్లో స్పీడ్‌ పెంచింది. కాగా, మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ చేపట్టిన ఈ నిరసనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎండలో గంటల తరబడి ఆందోళనలో కూర్చున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొద్దిగా అలసిపోవడంతో ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్‌ను తాగారు. అనంతరం అదే బాటిల్‌ను తన సోదరి, వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాకు ఇచ్చారు.

ఈ క్రమంలో సింగ్‌ బాటిల్‌ను ప్రియాంక తీసుకునే ముందు వద్దు.. వద్దు అంటూ తిరస్కరించారు. అనంతరం ప్రియాంక ఆ డ్రింక్‌ను తీసుకుని వాసన చూసి.. ఒక సిప్‌ తీసుకుని మళ్లీ రాహుల్‌కు ఇచ్చేశారు. ఈ సరదా సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాహుల్ గాంధీ రూ.20 ‘స్టింగ్’ తాగడాన్ని కొందరు ఆయన సామాన్య ప్రజలతో మమేకం కావాలనే ప్రయత్నానికి ప్రతీకగా అభివర్ణించారు.  మరికొందరు ఇద్దరి మధ్య ఉన్న సోదరసోదరీ అనుబంధాన్ని ప్రస్తావించారు. కొందరు మాత్రం రాజకీయ వ్యంగ్యానికి ఉపయోగించుకున్నారు.

ఇదిలా ఉండగా.. ఇక్కడే ఈ ఘటనకు మరో ఆసక్తికరమైన అంశం ఉంది. రాహుల్‌, ప్రియాంకలు ‘స్టింగ్‌’ తాగుతున్న సమయంలోనే.. పెప్సీకో ఢిల్లీ హైకోర్టులో ‘ఎనర్జీ డ్రింక్‌’ అనే పదాన్ని తమ ఉత్పత్తులపై ఉపయోగించడంపై జరుగుతున్న కేసులో పోరాడుతోంది. పెప్సీకో ఉత్పత్తులపై ‘ఎనర్జీ డ్రింక్‌’ అనే పదాన్ని ఉపయోగించడాన్ని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI) వ్యతిరేకించింది. ఆ పదాన్ని ఉత్పత్తుల లేబుళ్ల నుంచి తొలగించాలని కంపెనీని ఆదేశించింది. అలాగే ఆ లేబుల్‌తో ఉన్న ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవాలని దేశవ్యాప్తంగా ఆహార భద్రతా అధికారులకు సూచించింది.

దీంతో పెప్సీకో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో మంగళవారం కోర్టు కంపెనీకి మధ్యంతర ఊరట ఇచ్చింది. ఇప్పటికే తయారై మార్కెట్‌లో ఉన్న ‘ఎనర్జీ డ్రింక్‌’ లేబుల్‌ ఉన్న స్టాక్‌ను విక్రయించుకోవచ్చని కోర్టు తెలిపింది. అయితే కేసు తుది నిర్ణయం వచ్చే వరకు అదే వివాదాస్పద లేబుల్‌తో కొత్త ఉత్పత్తులను తయారు చేయకూడదని స్పష్టం చేసింది. మరోవైపు ‘ఎనర్జీ డ్రింక్‌’ అనే పదాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే దానిపై ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. కెఫీన్‌ ఉన్న పానీయాలను ‘ఎనర్జీ డ్రింక్‌’గా పిలవడం వల్ల అవి శరీరానికి పోషక శక్తిని లేదా అదనపు శక్తిని అందిస్తాయనే అభిప్రాయం వినియోగదారుల్లో కలగవచ్చని పేర్కొన్నాయి.

కెఫీన్‌ ప్రధానంగా శరీరాన్ని ఉత్తేజపరిచే పదార్థంగా పనిచేస్తుంది. ఇది కొంతసేపు అప్రమత్తతను పెంచి, అలసట అనిపించడాన్ని తగ్గించవచ్చు. అయితే కెఫీన్‌ స్వయంగా శరీరానికి పోషక శక్తి లేదా క్యాలరీలను అందించదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అధిక కెఫీన్‌, అదనపు చక్కెర ఉన్న పానీయాలను యువత, క్రీడాకారులు, ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారిని లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేయడం వల్ల వినియోగదారుల ఆరోగ్యంపై ఆందోళనలు తలెత్తుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. అలా ఢిల్లీలో ఒకవైపు నిరసనలో రాహుల్‌ గాంధీ చేతిలో కనిపించిన ‘స్టింగ్‌’ ఆసక్తిని రేపగా.. మరోవైపు అదే సమయంలో ‘ఎనర్జీ డ్రింక్‌’ అనే పదంపై పెప్సీకో కోర్టులో న్యాయపోరాటం చేస్తోంది.

ఇదీ చదవండి: జ్ఞానేశ్‌ కుమార్‌ టూర్‌కు మళ్లీ బ్రేక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement