
ఆయనో స్కూల్‌కు హెడ్‌మాస్టర్. ఓ మహిళా టీచర్‌ను వేధించారని ఆయనకు ఉన్నతాధికారి నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఆ నోటీసుకు వివరణ ఇచ్చేందుకు ఆ అధికారి ఆఫీస్‌కు హెచ్‌ఎం వెళ్లారు. చేతిలో ఫైల్‌ను బల్లకేసి కొట్టి.. నడుముకు ఉన్న బెల్డ్ తీసి అధికారిని చితకబాదడం మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ పెద్దసారుకు మద్దతుగా పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు రోడ్డెక్కడంతో ప్రభుత్వమే దిగి వచ్చింది!!..
సీతాపూర్ హెడ్‌మాస్టర్ బృజేంద్ర కుమార్ వర్మ వ్యవహారం ఉత్తర ప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సీతాపూర్ విద్యా శాఖ అధికారి(BSA) అఖిలేష్ ప్రతాప్ సింగ్‌ను వర్మ బెల్ట్‌తో బాదిన వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో ఆయన్ని సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా వర్మ భార్య సీమ, స్టూడెంట్స్-పేరెంట్స్‌తో కలిసి స్కూల్ బయట నిరసనలకు దిగారు. ఈ క్రమంలో అఖిలేష్‌పై సంచలన ఆరోపణలకు దిగారామె.
అవంతిక గుప్తా మహ్‌ముదాబాద్‌లోని నద్వా ప్రైమరీ స్కూల్‌కి పోస్టింగ్ మీద వచ్చి చేరింది. అయితే ఆమె బడికి రెగ్యులర్‌గా రావడం లేదు.దీంతో.. హెడ్‌మాస్టర్ బృజేంద్ర కుమార్ వర్మ ఆమె నుంచి వివరణ కోరాడు. అయితే.. ఆమె నేరుగా బదులివ్వకుండా సీతాపూర్ BSA కార్యాలయం నుంచి ఫోన్ చేయించింది. ఆమె బడికి రాదని.. అయినా అటెండెన్స్ వేయమని బీఎస్‌ఏ అధికారి అఖిలేష్ ప్రతాప్ సింగ్ ఆదేశించాడు. ఆమె నిత్యం తన ఇంటి ముందు నుంచే వెళ్తోందని.. పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు అడిగితే ఏం సమాధానం చెప్పాలని వర్మ అభ్యంతరం చెప్పాడు. ఎవరైనా అడిగితే మెడికల్ లీవ్‌లో ఉందని చెప్పమంటూ అఖిలేష్ ఫోన్ పెట్టేశాడు. అయితే..
హెచ్‌ఎం వర్మ మాత్రం ఆ ఒత్తిళ్లకు తలొగ్గలేదు. ఇది అవంతిక, అఖిలేష్‌లకు కోపం తెప్పించింది. అప్పటి నుంచి వర్మను రకరకాలుగా వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె వర్మపై అఖిలేష్‌కు వేధింపుల ఫిర్యాదు చేయడంతో పరిస్థితి మరోలా మారింది. వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయడంతో.. వర్మకు పట్టరాని కోపం వచ్చింది. అంతే దాడి చేశారు.. అని వర్మ సతీమణి సీమ మీడియాకు వివరించారు. ఈ క్రమంలో.. వర్మ-అఖిలేష్ మధ్య ఫోన్ సంభాషణను ఆమె మీడియాకు విడుదల చేశారు.
UP govt headmaster slams file, flogs BSA using belt
In UP's Sitapur, a primary school headmaster Brijendra Kumar Verma was summoned by the Basic Siksha Adhikari (BSA) Akhilesh Pratap Singh over a complaint registered against Verma. Verbal argument ensued. Headmaster Verma… pic.twitter.com/8YGiFBTmfw— Piyush Rai (@Benarasiyaa) September 23, 2025
ఇదిలా ఉంటే..పిల్లలు-తల్లిదండ్రుల నిరసనలతో ప్రభుత్వం కదిలొచ్చింది. బీఎస్‌ఏ అఖిలేష్‌ను విధుల నుంచి తొలగిస్తూ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి వర్మకు వేధింపులు ఎదురైన మాట వాస్తవమేనని ప్రకటించారు. ఇంకోవైపు.. సోషల్ మీడియాలో హెచ్‌ఎం వర్మకు సపోర్టుగా పలువురు పోస్టులు చేయసాగారు. ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన అవంతికను విద్యాశాఖ సస్పెండ్ చేయగా.. ఆమె పరారీలో ఉన్నట్లు సమాచారం. అవంతిక-అఖిలేష్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటన్నది ఇంకా బయటకు రాలేదు. అయితే ఆమె స్టూడెంట్స్‌తో కలిసి రీల్స్ చేసిన వీడియోలు మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.