
ఎన్‌డీఏ పక్షాల సమావేశం ఏకగ్రీవ నిర్ణయం
12న అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చే అవకాశం
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక బాధ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలకు అప్పగిస్తూ ఎన్‌డీఏ కూటమి నిర్ణయం తీసుకుంది. గురువారం పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన బీజేపీ, మిత్ర పక్షాల నేతల భేటీలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయించారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమిత్ షా, జేపీ నడ్డాలతోపాటు జేడీయూ నుంచి లలన్ సింగ్, శివసేన నుంచి శ్రీకాంత్ షిండే, టీడీపీ నుంచి ఎల్. దేవరాయలు, ఎల్‌జేపీ నుంచి చిరాగ్ పాశ్వాన్, ఇంకా అనుప్రియా పటేల్, ఉపేంద్ర కుష్వాహా, ఏఐఏడీఎంకే తదితర ఇతర చిన్న పార్టీల నేతలు సైతం పాల్గొన్నారన్నారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని బలపర్చాలనే అంశంపై ఎలాంటి చర్చా జరగలేదని తెలిపారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ఈ నెల 12వ తేదీన స్పష్టత వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఎన్‌ఏడీ పక్షాల మధ్య సమన్వయం కొనసాగింపుపై ఈ సమావేశం చర్చించిందన్నారు.