దేశంలో మొట్టమొదటి వందేభారత్ స్లీపర్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. శనివారం మాల్డా రైల్వేస్టేషన్‌లో జరిగిన జరిగిన కార్యక్రమంలో.. రైలు, రోడ్లకు సంబంధించి మొత్తం రూ.3,250 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. వందేభారత్ స్లీపర్ రైలుతోపాటు నాలుగు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వర్చువల్‌గా పచ్చజెండా ఊపారు. వందేభారత్ స్లీపర్ రైలు బెంగాల్‌లోని హౌరా నుంచి అస్సాంలోని గౌహతి మధ్య రాకపోకలు సాగించనుంది. ప్రయాణ సమయం 18 గంటల నుంచి 2.5 గంటలకు తగ్గిపోతుంది.
కొత్త రైళ్ల రాకతో ఈ ప్రాంతంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని ప్రధానమంత్రి వివరించారు.కాళీమాత, కామాఖ్య మాతల పవిత్ర క్షేత్రాలను అనుసంధానించే రైలును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఆధునిక రైళ్ల గురించి గతంలో విన్నామని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని వ్యాఖ్యానించారు. అమెరికా లేదా యూరప్ కంటే మనదగ్గరే ఎక్కువ రైల్వే కోచ్‌లు తయారవుతున్నాయని గుర్తుచేశారు. దేశంలో రవాణా సదుపాయాలను ఆధునీకరిస్తున్నామని, ఈ విషయంలో స్వయం సమృద్ధి సాధిస్తున్నామని తెలిపారు. మాల్డా స్టేషన్‌లో ప్రయాణికులతో మోదీ మాట్లాడారు.


