
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో యువత విద్య, నైపుణ్యా భివృద్ధి, వ్యవస్థాపకతకు ఊతం ఇచ్చే దిశగా రూ.62 వేల కోట్లకు పైగా విలువైన పలు యువత– కేంద్రీకృత కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. శనివారం ఉద యం 11 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ‘కౌశల్ దీక్షాంత్ సమారోహ్’లో ఆయన పాల్గొంటారు.
దేశ వ్యాప్తంగా పారిశ్రామిక శిక్షణా సంస్థల(ఐటీఐ) నుంచి ఆల్ ఇండియా టాపర్లుగా నిలిచిన 46 మందిని ప్రధాని మోదీ సత్కరించనున్నారు.ఈ కార్యక్రమాల్లో అత్యంత కీలకమైనది ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐలు’ (పీఎం–సేతు). కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన దీనికోసం రూ.60 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నారు.
ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐలను ‘హబ్ అండ్ స్పోక్’ నమూనాలో ఆధునీకరించనున్నారు. ఇందులో 200 ఐటీఐలు ‘హబ్’లుగా, 800 ఐటీఐలు ‘స్పోక్’లుగా పనిచేస్తాయి. ప్రతి హబ్‌కు సగటున నాలుగు స్పోక్‌లు అనుసంధానమై ఉంటాయి. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 400 నవోదయ విద్యాల యాలు, 200 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 1,200 వృత్తి నైపుణ్య ల్యాబ్‌లను ప్రధాని ప్రారంభించనున్నారు.
మారుమూల, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు సైతం ఐటీ, ఆటోమోటివ్, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, టూరిజం వంటి 12 కీలక రంగాల్లో ప్రత్యక్ష శిక్షణ అందించడమే ఈ ల్యాబ్స్ లక్ష్యం. జాతీయ విద్యా విధానం–2020కి అనుగు ణంగా 1,200 మంది వృత్తి విద్యా ఉపాధ్యా యులకు శిక్షణ ఇచ్చారు. బిహార్‌కు సంబంధించిన పలు పథకాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.