తిరువనంతపురం: దక్షిణాది రాష్ట్రం కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఇది వికసిత కేరళ సమయం.. రానున్నది ఎన్‌డీఏ ప్రభుత్వానికి సమయం అంటూ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘కేరళలో అవినీతి అభివృద్ధిని తీవ్రంగా అడ్డుకుంది. ఎల్‌డీఎఫ్ హయాంలో బ్యాంకుల్లో జమ చేసిన పొదుపు కూడా ప్రభావితమైంది. సహకార బ్యాంకు కుంభకోణం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బు దోపిడీకి గురైంది. బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి. దోపిడీదారుల నుండి ప్రతి రూపాయిని తిరిగి తీసుకునేలా మేము చూస్తాం. అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)ల అవినీతిని అంతం చేస్తాం. రాబోయే ఎన్నికలు రాష్ట్ర పరిస్థితులను మార్చేస్తాయి.
ఇప్పటివరకు మీరు ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌ల పాలన మాత్రమే చూశారు. అవి రాష్ట్రాన్ని నాశనం చేశాయి. మూడోవైపు ఉంది. అది బీజేపీ అభివృద్ధి, సుపరిపాలనను అందిస్తుంది. కేరళలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌లకి వేర్వేరు జెండాలు ఉన్నప్పటికీ.. వాటి అజెండా ఒక్కటే. అదే అవినీతి, జవాబుదారీతనం లేకపోవడం. ఇప్పుడు ప్రజల అభివృద్ధికి తోడ్పడే ప్రభుత్వం అవసరం, ఆ పని మేం చేస్తాం. కేరళ ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచి.. మాతో చేతులు కలపాలి అని కోరారు.
#WATCH | Thiruvananthapuram, Kerala: At a BJP rally, PM Modi says, "The upcoming elections will be the ones to change the condition and direction of Kerala. When it comes to the future of Kerala, you have seen just two sides so far. On one side, there is LDF, and on the other… pic.twitter.com/DmLIEmghQV
— ANI (@ANI) January 23, 2026
ఇదే సమయంలో శబరిమల ఆలయంలో బంగారు చోరీ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. మొత్తం దేశానికి, మనందరికీ అయ్యప్ప స్వామిపై అచంచలమైన విశ్వాసం ఉంది. అయితే, ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం శబరిమల ఆలయ సంప్రదాయాలను దెబ్బతీయడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు, ఇక్కడ బంగారం దొంగతనం జరిగినట్లు నివేదికలు వస్తున్నాయి. స్వామివారి పక్కనుండే ఆలయం నుండి బంగారం దొంగిలించబడినట్లు నివేదికలు వస్తున్నాయి. నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. కేరళలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరుగుతుంది. దోషులను జైలుకు పంపిస్తాం. దీనిపై విచారణ జరిగేలా చూడటం ‘మోదీ గ్యారెంటీ’ అని పేర్కొన్నారు.
కాగా, కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ భారీ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ కేరళలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికలలో బీజేపీ.. 45 సంవత్సరాల తర్వాత ఎల్‌డీఎఫ్ నుండి తిరువనంతపురం కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ప్రధాని ఈ విజయాన్ని అసాధారణమైనదిగా, చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ ఇది కేరళలో బీజేపీ ప్రభుత్వానికి పునాది వేసిందని అన్నారు. ఇక, కేరళ అసెంబ్లీలోని 140 స్థానాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.


