మౌలిక సదుపాయాలతోనే దేశాభివృద్ధి | PM Modi Launches 4 New Vande Bharat Trains | Sakshi
Sakshi News home page

మౌలిక సదుపాయాలతోనే దేశాభివృద్ధి

Nov 9 2025 2:16 AM | Updated on Nov 9 2025 2:16 AM

PM Modi Launches 4 New Vande Bharat Trains

మన దేశం ప్రగతి పథంలో దూసుకెళ్తోంది  

ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ  

వారణాసిలో నాలుగు వందేభారత్‌ రైళ్లు ప్రారంభం  

వారణాసి: ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక ప్రగతికి మౌలిక సదుపాయాలే అత్యధికంగా దోహదం చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన దేశం ప్రగతి పథంలో అత్యధిక వేగంతో దూసుకెళ్తోందని అన్నారు. ప్రధాని మోదీ శనివారం సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. బనారస్‌ రైల్వే స్టేషన్‌లో నాలుగు నూతన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుంటే దేశం వేగంగా ప్రగతి సాధిస్తుందని స్పష్టంచేశారు. మౌలిక సుదుపాయాలు అంటే కేవలం రోడ్లు, వంతెనలు మాత్రమే కాదన్నారు. ఒక ప్రాంతంలో అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధికి తోడ్పాటునందించే వ్యవస్థనే మౌలిక సదుపాయాలు అంటారని వివరించారు. 

విదేశీయులు ఆశ్చర్యపోతున్నారు 
‘‘వందేభారత్‌ రైళ్లు దేశమంతటా పరు గులు తీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి విమానాలు మన దేశానికి రాకపోకలు సాగిస్తున్నాయి. కొత్తతరం భారతీయ రైల్వేకు వందేభారత్, నమోభారత్, అమృత్‌ భారత్‌ వంటి రైళ్లు పునాదిగా నిలుస్తున్నాయి. మన అభివృద్ధి ప్రయాణం వేగం పుంజుకుంది. వందేభా రత్‌ అంటే భారతీయుల కోసం భారతీయు లు రూపొందించుకున్న రైళ్లు. ఇవి ప్రతి ఒక్కరికీ గర్వకారణం. వందేభారత్‌ రైళ్లను చూసి విదేశీయులు కూడా ఆశ్చర్యపోతు న్నారు. మన వనరులను మెరుగుపర్చు కోవడంలో ఈ రైళ్లు మైలురాయి లాంటివి. దేశమంతటా 160కిపైగా వందేభారత్‌ రైళ్లు పరుగులు తీస్తుండడం సంతోషంగా ఉంది.  

‘వికసిత్‌ కాశీ’ నుంచి ‘వికసిత్‌ భారత్‌’ 
ఉత్తరప్రదేశ్‌లో ఆధ్యాత్మక పర్యాటకం నానాటికీ ఊపందుకుంటోంది. దేశ విదే శాల నుంచి పర్యాటకులు తరలివస్తు న్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం లభిస్తోంది. పుణ్యక్షేత్రాల సందర్శన మన సంస్కృతిలో భాగం. ఆధ్యాత్మిక యాత్రలు దేశ ఆత్మను అనుసంధానిస్తాయి. ప్రయాగ్‌రాజ్, అయోధ్య, హరిద్వార్, చిత్రకూట్, కురుక్షేత్ర వంటి పుణ్యస్థలాలు మన ఆధ్యాత్మిక విశ్వాసానికి కేంద్ర స్థానాలు. వందేభారత్‌ రైళ్ల రాకతో మన పుణ్యక్షేత్రాల మధ్య అనుసంధానం ఏర్పడింది. కాశీ విశ్వనాథుడిని గతేడాది 11 కోట్ల మందికిపైగా భక్తులు దర్శించుకు న్నారు.

అయోధ్యలో రామమందిర నిర్మా ణం తర్వాత 6 కోట్ల మంది వచ్చారు. శ్రీరా ముడి ఆశీస్సులు స్వీకరించారు. భక్తుల రాకవల్ల ప్రభుత్వానికి ఆదాయంతోపాటు స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రధానంగా యువతకు లబ్ధి చేకూరుతోంది. ‘వికసిత్‌ కాశీ’ నుంచి ‘వికసిత్‌ భారత్‌’ కలను నెరవేర్చడానికి ఇక్కడ మరిన్ని ప్రాజెక్టులు ప్రారంభిస్తాం’’ అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. వందేభారత్‌ రైళ్ల ప్రారంభోత్సవంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కొత్త రైళ్లు బనారస్‌ –ఖజురహో, లక్నో–శహరాన్‌పూర్, ఫిరోజ్‌ పూర్‌–ఢిల్లీ, ఎర్నాకుళం–బెంగళూరు మధ్య ప్రయాణిస్తాయి.  

కాశీ పిల్లలు నాకు గర్వకారణం
వారణాసిలో వందేభారత్‌ రైళ్లు ప్రారంభించిన అనంతరం ఓ రైలులో చిన్నారులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. కొందరు పిల్లలు పద్యాలు, కవితలు చదివి వినిపించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేశారు. ‘వికసిత్‌ కాశీ, వికసిత్‌ భారత్, సురక్షిత భారత్‌’పై కవితల రూపంలో తమ భావాలు పంచుకున్న చిన్నారులను అభినందించారు. నైపుణ్యం కలిగిన కాశీ చిన్నారులను చూసి స్థానిక ఎంపీగా ఎంతగానో గర్విస్తున్నానని చెప్పారు. దేశవ్యాప్తంగా జరిగే కవి సమ్మేళనాలకు ఇక్కడి పిల్లలను తీసుకెళ్లే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పిల్లలతో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. వందేభారత్‌ రైళ్లు ప్రారంభించినప్పుడు పిల్లలకు వేర్వేరు అంశాలపై పోటీలు నిర్వహించాలని సూచించారు. దేశ అభివృద్ధి, వందేభారత్‌ రైళ్లు, అభివృద్ధి చెందిన భారత్‌కు సంబంధించిన ఊహాచిత్రాలు, పద్యాలపై ఈ పోటీలు ఉండాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement