జపాన్ ప్రధాని నా అందమైన చెల్లెలు: మోదీ | Pm Modi Calls Japan Pm His Younger Sister She Responds With A Smile | Sakshi
Sakshi News home page

జపాన్ ప్రధాని నా అందమైన చెల్లెలు: మోదీ

Jul 2 2026 4:11 PM | Updated on Jul 2 2026 4:47 PM

Pm Modi Calls Japan Pm His Younger Sister She Responds With A Smile

జపాన్‌ ప్రధాని సనాయె తకాయిచీని తన అందమైన సోదరిగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ చూపిన ఆప్యాయతకు చిరునవ్వుతో స్పందించిన జపాన్‌ ప్రధాని.. తనను అందమైన చెల్లెలు అని పిలిచినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ (గురువారం) ఢిల్లీలో ప్రధాని మోదీతో జపాన్‌ ప్రధాని భేటీ అయ్యారు. భారత్‌-జపాన్‌ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి.

వచ్చే పదేళ్లలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా.. ఫార్మా, ఢిఫెన్స్‌, ఏఐ టెక్నాలజీ రంగాల్లో ఒప్పందాలు జరిగాయి. భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం మొదటిసారి భారతదేశాన్ని సందర్శిస్తున్న నా చెల్లెలు, జపాన్ ప్రధాని తకాయిచీకి నేను ఘన స్వాగతం పలుకుతున్నాను. ఆమె జపాన్‌కు మొదటి మహిళా ప్రధాన మంత్రి, అలాగే దూరదృష్టి గల నాయకురాలిగా ప్రజాదరణ పొందారంటూ ప్రధాని మోదీ  ప్రశంసించారు.

జపాన్‌ ప్రధాని మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం భారత్‌కు చేరుకున్నారు. భారత్‌లో ఇదే ఆమె మొట్టమొదటి అధికారిక పర్యటన. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పర్యటనకు వచ్చారు. ఇవాళ ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో మోదీతో ఆమె సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, పెట్టుబడులు తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. అలాగే 16వ ఇండియా–జపాన్‌ వార్షిక సదస్సులో పాల్గొన్నారు.

భారత్‌లో అడుగుపెట్టిన ఫొటోను తకాయిచీ ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. భారతదేశంలో తొలి పర్యటన సందర్భంగా తకాయిచీకి ఆతిథ్యం ఇవ్వడం తమకు ఎంతో సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు. భారత్‌–జపాన్‌ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేలా గురువారం జరగబోయే సమగ్ర చర్చల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. మన ఉమ్మడి కృషి ద్వారా ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్ధిని పెంపొందించడాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.    

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement